తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గత కొన్ని వారాలుగా భానుడి భగభగలతో, తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిపోయిన జనం.. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం వరకు ఎండలు దంచుతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడ్డారు. అయితే, వాతావరణంలో అకస్మాత్తుగా సంభవించిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుండటం గమనార్హం.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉంది. రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. కేవలం సాధారణ వర్షాలే కాకుండా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వర్షాల సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మరియు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురవగా.. పెద్దపల్లి జిల్లా సారంగపూర్‌లో కూడా అదే స్థాయిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే.. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 5 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్‌లో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. నిర్మల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలైన లోకేశ్వరంలో 4.4 సెంటీమీటర్లు, సారంగపూర్‌లో 4.4 సెంటీమీటర్లు, భైంసాలో 4.3 సెంటీమీటర్లు, నిర్మల్ టౌన్‌లో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో కూడా 4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసి వాతావరణాన్ని చల్లబరిచింది.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారింది. ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి.. చల్లటి గాలులు వీస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్నటి నుంచి పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో 2.6 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1.6 సెంటీమీటర్లు, హయత్‌నగర్‌లో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
