జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి రెండవ వారంలో సూర్యాపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. గురువారం గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచి మేయర్ పదవి తిరిగి కాంగ్రెస్ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రజలకు సమానత్వం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు చేరవేస్తున్నామని అన్నారు.
TG Govt : విద్యుత్ సామర్థ్యము పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు
ఫిబ్రవరి 5న కుల గణన నివేదిక క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు. రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్‌లో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతేగాక, కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని, టీఆర్‌ఎస్ హయాంలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని గమనించాలని రియల్టర్లకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి నివేదించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకుని సూర్యాపేటలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, స్థానిక సమస్యలను హైలైట్ చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
రైతులకు రుణ మాఫీ అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని మహేష్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ పర్యటన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తన విధానాలను స్పష్టంగా తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు.