రేవంత్ సర్కార్ (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే (Caste census Survey) రేపు నవంబర్ 6 నుంచి మొదలుకాబోతుంది. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన రాహుల్..కులగణనపై కీలక వ్యాఖ్యలు చేసారు.
కులగణనపై తన మద్దతు ప్రకటిస్తూ.. ఈ గణనతో అన్ని కులాలకు సమాన న్యాయం జరిగే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కులాల వారీగా జనాభా లెక్కించడం ద్వారా, చాలా కాలంగా వివక్షకు గురవుతూ వచ్చిన కులాలకు ప్రాతినిధ్యం దొరుకుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ విధానం తరాలుగా బలహీన స్థితిలో ఉన్న వారిని అర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ముందుకు నెట్టగలదని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో కుల వ్యవస్థ ఎంతగా బలంగా ఉందో వివరించారు. అగ్రకులాల వారికి ఈ వ్యవస్థ నుంచి ఇబ్బందులు అనిపించకపోవచ్చు గానీ, ఇతర కులాలకు మాత్రం ఇది ఆత్మవిశ్వాసం, అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కులవ్యవస్థ రూపుమాపాలని, అంతటి నిర్మూలన అవసరమని రాహుల్ అన్నారు. దేశంలో కుల వివక్ష లేదని అబద్ధం చేపలేకపోతున్నాను అన్న రాహుల్ గాంధీ.. రాజకీయ నాయకుడిగా తాను ప్రజల సమస్యలను వాస్తవ దృష్టితో చూడలనుకుంటున్నట్లు వెల్లడించారు.
తాను పాదయాత్ర చేసిన సమయంలో దేశమంతా తిరినప్పుడు.. ప్రజల్లో ఉన్న వివక్ష తనను ఆలోచనల్లో పడేసిందని రాహుల్, దానిని తాను తట్టుకోలేకపోయానని అన్నారు. ఓ రాజకీయ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటున్నాన్న రాహుల్.. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలకు దేశంలో సరైన గౌరవం ఉందని చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలున్నాయని అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణా కులగణన రోల్ మోడల్ అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే.. ఇందులో కొన్ని పొరబాట్లకు అవకాశముందన్న రాహుల్.. వాటిని నిత్యం సమీక్షించుకుంటూ ముందుకు వెళతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కూడా కులగణన అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాహుల్ గాంధీ వారిచెప్పిన సూచనలను స్వయంగా నోట్ చేసుకోవడం విశేషం.
Read Also : World Tsunami Awareness Day : ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి?