New Ministers List: ఏప్రిల్ 3న తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం నడుమ ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతో బీసీలు, రెడ్డి, ఎస్సీ వర్గాలకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే టాక్ మళ్లీ మొదటికి వచ్చింది. మంత్రి పదవులను ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేల పేర్లతో టీపీసీసీ పంపిన లిస్టును పరిశీలించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. అందులోని కొన్ని పేర్లపై అభ్యంతరం చెప్పారట. పలువురు నేతల పేర్లను లిస్టులో ఎందుకు చేర్చారని ప్రశ్నించారట.
Also Read :BRS Defecting MLAs: ‘‘ఉప ఎన్నికలు రావు అంటారా ?’’ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం
సోదరుడికీ మంత్రి పదవా ?
ఈసారి మంత్రివర్గ విస్తరణ కోసం ప్రతిపాదించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉంది. ఇప్పటికే ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వడం ఎలా కుదురుతుందని రాహుల్ ప్రశ్నించినట్లు సమాచారం. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరే సమయంలోనే వివేక్, రాజగోపాల్ రెడ్డిలకు మంత్రి పదవి కేటాయింపుపై హామీ ఇచ్చిన విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు గుర్తు చేశారట. తాము పూర్తి స్థాయిలో దీనిపై ఆలోచన చేసిన తరువాత తుది నిర్ణయం చెప్పే వరకూ వేచి చూడాలని రాహుల్ స్పష్టం చేశారట. గత ఎన్నికలకు ముందు వరకు ఆయన బీజేపీలో ఉన్నారు. ‘‘బీజేపీలో ఉన్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(New Ministers List) కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు’’ అంటూ తెలంగాణలో మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు నేతలు ఆనాటి వీడియో క్లిప్స్‌ను కాంగ్రెస్ పెద్దలకు పంపినట్లు తెలిసింది.
Also Read :Telecom Network Maps: మీ ఏరియాలో సిగ్నల్ ఉందా? కవరేజీ మ్యాప్స్ ఇవిగో
సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియరా ?
ప్రస్తుతం సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ సహా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఇవాళ రాత్రి లేదా రేపు రాత్రికల్లా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ సూచనల మేరకు మంత్రి పదవుల కోసం ఆశావహుల జాబితాను రివైజ్ చేసి సమర్పించే ఛాన్స్ లేకపోలేదు. రెడ్డి వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. తాజా పరిణామంతో సీఎం రేవంత్ మద్దతు కలిగిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు పెరిగాయి. వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.