Rahul Gandhi : దేశంలో ఉన్న ధనికుల కోసం బిజెపి పనిచేస్తుంది – రాహుల్ గాంధీ

ఇప్పటివరకూ సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను బీజేపీ మాఫీ చేసిందని దుయ్యబట్టారు

  • Written By:
  • Publish Date - May 5, 2024 / 04:21 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిర్మల్ (Nirmal) లో జరిగిన జనజాతర సభ కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఫై నిప్పులు చెరిగారు. బీజేపీ కేవలం దేశంలో ఉన్న ధనికుల కోసం పనిచేస్తుందని, ఇప్పటివరకూ సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను బీజేపీ మాఫీ చేసిందని దుయ్యబట్టారు. అదే మాఫీ చేసిన డబ్బుతో దేశంలోని పేదలు ఒక్కొక్కరికి 25 వేల రూపాయలను ఇస్తే.. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ రుణమాఫీలు చేసి, ఉపాధిహామీ ఇస్తే ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నామని దూషించే బీజేపీ.. సంపన్నులకు దోచిపెట్టిన సొమ్ము గురించి మాత్రం ప్రశ్నిస్తే మాట్లాడదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లు ఆరు హామీలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్న రాహుల్.. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. ఒక్కో పేద కుటుంబం బ్యాంక్ అకౌంట్ లో ప్రతిఏటా లక్ష రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ సర్కార్ యువకులను నిరుద్యోగులుగా మార్చిందని విమర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి.. ఉపాధిని చూపిస్తామని, శిక్షణ సమయంలో 8500 భృతి అందజేస్తామని తెలిపారు. అలాగే 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ తెలిపారు.

ప్రస్తుత ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయని, ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్‌ ఉంటే, మరోవైపు భారత రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని, హక్కులు సంక్రమించాయని చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే తమని ప్రశ్నిస్తున్నారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. పెద్దలకు బీజేపీ రుణమాఫీ చేస్తే ఎవరూ అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రూ.2500 బ్యాంక్‌ ఖాతాలో వేస్తామని, ఆరోగ్య భద్రత రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. పేదలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు.

Read Also : KTR : కేటీఆర్ ను చీర కట్టుకోవాలని సీఎం రేవంత్ సలహా