Site icon HashtagU Telugu

T Congress : రేవంత్‌కి రాహుల్ గాంధీ క్లాస్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో..?

Revanth Reddy Nomination

TPCC President Revanth Reddy announced Congress manifesto released date

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నారు. పార్టీని నడిపించాల్సిన వాడివి నీవే వెనకబడుతున్నావు అంటూ సూచనలతో పాటుగా హెచ్చరికలు జారీ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లు తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని రాహుల్ గాంధీ రేవంత్‌కి చెప్పారు. పార్టీ పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా.. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ తో పాటుగా సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లోనూ వెనుకబడి ఉన్నారని రాహుల్ రేవంత్‌కి చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవాలని.. సీనియర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసారు.

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణతో సిద్ధమయ్యారు. కర్ణాటక గెలుపును తెలంగాణలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా పని చేయటం ద్వారా అధికారంలోకి వచ్చిన అంశాన్ని రాహుల్ గెలుపు వ్యూహంలో ప్రధాన అంశంగా గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ కు అదే విషయాన్ని స్పష్టం చేసారు. పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలు, ఈగోలతో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేసారని పార్టీలో చర్చ జరుగుతోంది.

రేవంత్ పైన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేసారు. తన పైన రేవంత్ టీమ్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్త‌మ్ ఆధారాలు సమర్పించారు. తనను పార్టీలో నుంచి బయటకు పంపే విధంగా పొమ్మనకుండా పొగ పెడుతున్నారని నేరుగా సోనియాకు వివరించారు. ఈ అంశం పైన రాహుల్ నేరుగా రేవంత్ ను నిలదీసినట్లు సమాచారం. ఇదే సమయంలో రేవంత్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ తగ్గటం పైనా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల పై రాహుల్ గాంధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగింది. మినీ ఇండియాగా భావించే మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉన్నట్లు సర్వే నివేదికలు అందాయని.. పూర్తి సమాచారంతోనే రేవంత్ ను రాహుల్ ప్రశ్నలు సంధించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభావం చూపగల నేత పార్టీకి దూరం అయ్యారని..అందరినీ కలుపుకు వెళ్లాలని రేవంత్ కు రాహుల్ ఒకింత గట్టిగానే సూచన చేసారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీకి వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్ టీమ్ కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారంగా రాహుల్ ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీని పటిష్టం చేయాలనే గుర్నాథ్ రెడ్డి ని పార్టీ లోకి ఆహ్వానించినట్లు రాహుల్ కి రేవంత్ వివరణ ఇచ్చారు.

Exit mobile version