DS: డీఎస్ కాంగ్రెస్ లో చేరడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదా?

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించిన డీ శ్రీనివాస్ ఆపార్టీపై అలిగి టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు. తాజాగా డీఎస్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 05:10 PM IST

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించిన డీ శ్రీనివాస్ ఆపార్టీపై అలిగి టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు. తాజాగా డీఎస్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో డి శ్రీనివాస్ ఒకరు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖరరెడ్డి, డీఎస్ ఇద్దరు జోడెద్దులుగా ఉండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేత గా, డీఎస్ పీసీసీ అధ్యక్షుడుగా ఏకకాలంలో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక పదవులు అనుభవించిన డీఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీలో ఏర్పడిన అనూహ్య పరిణామాలతో పార్టీని వీడారు.

రాష్ట్ర విభజన తరువాత కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడిన డీఎస్ మరల పార్టీలోకి రావడం పట్ల కాంగ్రెస్ లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం పట్ల కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరికి రాహుల్ గాంధీ సైతం డీఎస్ రాకను వ్యతిరేకించినట్లు సమాచారం.

రాజకీయాల్లో చివరి ఆంకంలో ఉన్న డీఎస్ కాంగ్రెస్ పార్టీలోనే తుదిశ్వాస విడిచిపెట్టాలనే ఆలోచనతో మరోసారి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దం అయ్యారట. సోనియాగాంధీ తో డీఎస్ సమావేశమైన సందర్భంగా తనకి పార్టీలో ఎటువంటి పదవులు అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీలో నేను ఎన్నో పదవులు అనుభవించానని ఇక తుదిశ్వాస కాంగ్రెస్ లోనే విడవాలని ఆశగా ఉందని డీఎస్ సోనియా తో చెప్పారట. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా తనకి ఎటువంటి పదవులు ఇచ్చేదిలేదని సోనియాగాంధీ డీఎస్ కు స్పష్టం చెప్పినట్లు సమాచారం.

డీఎస్ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని ఒక కుమారున్ని బీజేపీ పార్టీ నుండి నిజామాబాద్ లో ఎంపీ గా గెలిపించిన డీఎస్, మరో కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్తుని కాంగ్రెస్ లో తీర్చిద్దిద్ధాలనే ఆలోచనతోనే డీఎస్ కాంగ్రెస్ జెండా కప్పుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కొంతమంది నేతలు డీఎస్ పైన ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీ లో ఎంపీగా కొనసాగుతుండగా తండ్రి కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే ఆయన కాంగ్రెస్ లోకి వస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.
ఇన్ని సంఘటనలు జరిగాక తన మాతృసంస్థలో డీఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.