Telangana Politics: రాహుల్ చాతుర్యం, కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు లైన్‌క్లియర్ అయింది.

  • Written By:
  • Updated On - June 6, 2023 / 02:40 PM IST

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తి మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపాయి. కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ తెలంగాణలో సైతం జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ కర్ణాటక వ్యూహాన్ని తెలంగాణలో అమలుపరిచి, తద్వారా మళ్లీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.   ఈ నేపథ్యంలో రాహుల్ చాతుర్యంతో  ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు లైన్‌క్లియర్ అయింది. ఈ నెల 20న లేదా 25న వారిద్దరు హస్తం గూటికి చేరే అవకాశముంది. ఈ మేరకు కాంగ్రెస్‌లో చేరే విషయంపై ఇప్పటికే అనుచరులకు కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో ఇరువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. పొంగులేటి, జూపల్లికి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పలుమార్లు వారితో భేటీ అయ్యారు. కానీ ఆయన చర్చలు ఫలించలేదు. పొంగులేటి, జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ టీమ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే టీ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు కూడా విజయవంతమయ్యాయి. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఖమ్మం బహిరంగ సభపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ సమావేశానికి రాహుల్ లేదా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో భారీగా అనుచరులతో కలిసి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

వీరిద్దరితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లికి కాంగ్రెస్ పలు కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిద్దరికి టికెట్లు ఫిక్స్ చేయడంతో పాటు అనుచరులకు కూడా టికెట్లలో ప్రాధాన్యత ఇస్తామని హామీ లభించినట్లు సమాచారం. కాగా ఈనెల 20వ తేదీ లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా హస్తం పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి రాజకీయంగా బలపడుతున్న బీజేపీకి కర్నాటక ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరిన తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి ? కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరింతగా పెరుగుతాయా ? అనేది రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Also Read: Shocking: కర్ణాటకలో కలకలం.. రైల్వే ట్రాక్ పై రాళ్లు పెట్టిన బాలుడు, నెట్టింట్లో వీడియో వైరల్!