Rahul Gandhi: టీకాంగ్రెస్ నేతలకు రాహుల్ ‘దిశానిర్దేశం’

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న విభేదాలపై రాహుల్ గాంధీ వివరంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్ర శాఖలో అంతర్గత వ్యవహారాలపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహార శైలిని పార్టీ నేతలు తప్పుబట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అజెండాలను పక్కనబెట్టి పార్టీ ప్రయోజనాల కోసం పని చేయాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించవద్దని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా నేతలను ఆదేశించారని, అభ్యర్థుల జాబితాపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని సీనియర్ నేత ఒకరు తెలిపారు. గత వారం రోజుల వ్యవధిలో తెలంగాణ కాంగ్రెస్, రాహుల్ గాంధీని న్యూఢిల్లీలో కలవడం ఇది రెండోసారి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, క్రమశిక్షణ పాటించాలని ఆదేశించామని చెప్పారు. రైతుల పక్షాన పోరాడి, రైతు సంక్షేమం కోసం పాటుపడాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు సూచించారని మాజీ ఎంపీ వీ హనుమంతరావు తెలిపారు.

  Last Updated: 04 Apr 2022, 11:06 PM IST