Rahul Gandhi on TPCC: రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ అసంతృప్తి

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 30 నిముషాలు జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభ తరువాత, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల గురించి రాహుల్ కి మధుయాష్కీ వివరించారు. రేవంత్ ఇటీవల చేసిన ‘రెడ్డి’ కామెంట్స్ పై రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలు ఎలా ఆలోచిస్తున్నాయన్న విషయంపై రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఒక వర్గం వల్లే అధికారంలోకి రామని, అన్ని వర్గాలను కలుపుకుకోవాలని మధు యష్కీకి రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ బహుజనులను కేవలం ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకుంటున్నదనే ఆవేదనతో ఆయా వర్గాల ప్రజలు రెడ్డి, బీసీ కాంబినేషన్ లో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు రాహుల్ గాంధీకి మధు యాష్కీ వివరించారని సమాచారం. 2014 ఎన్నికల్లో బీసీలకు, 2018లో రెడ్లకు పూర్తిస్థాయిలో అవకాశం ఇచ్చినా పార్టీ ఓటమి పాలైందని, ఈ క్రమంలోనే బహుజన డిక్లరేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీని మధు యాష్కీ కోరారు.

తెలంగాణ వచ్చాక మైనార్టీలకు, ఎస్టీలకు, దళితులకు రిజర్వేషన్ పెంచుతానని చెప్పిన కేసీఆర్ ఆయా వర్గాలను మోసం చేశాడని, ఇప్పుడావర్గాలన్నీ కేసీఆర్ మీద ప్రతీకారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని రాహుల్ కి వివరించారు.

కాంగ్రెస్ పార్టీకి దూరమైన దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలను తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకురావాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అందర్ని కలుపుకుపోవాలని రాహుల్ స్పష్టం చేసినట్లు సమాచారం.

తెలంగాణకు పూర్తిస్థాయి ఇన్ ఛార్జీ ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయలపై రాహుల్ గాంధీ ఫోకస్ ఉండాలని మధు యాష్కీ కోరగా దీనికి రాహుల్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

కేసీఆర్ బహుజనులను కులవృత్తులకే పరిమితం చేసేందుకు ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంపవర్ మెంట్ దిశగా అడుగులు వేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు, గిరిజనులకు పోడు భూములు పంచింది కాంగ్రెస్ ప్రభుత్వాలన్న విషయం కూడా రాహుల్ గుర్తు చేశారు.

బీజేపీ టీఆర్ఎస్ లోపల కలిసుంటూనే బయటకు మాత్రం శత్రువుల్లా ఉన్నాయని దీన్ని ప్రజలకు వివరించాలని రాహుల్ తెలిపినట్లు తెలుస్తోంది.