Protocol Issues : మ‌హాక్ర‌తువుల్లో ‘ప్రొటోకాల్’ ర‌గ‌డ‌

తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన రెండు ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ప్రారంభోత్స‌వాల్లో ప్రొటోకాల్ ఇష్యూ రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది.

  • Written By:
  • Updated On - March 28, 2022 / 01:20 PM IST

తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన రెండు ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ప్రారంభోత్స‌వాల్లో ప్రొటోకాల్ ఇష్యూ రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన స‌మ‌తామూర్తి రామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు శిలాఫ‌క‌లంపై లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మిగిలిపోయింది. అంతేకాదు, చిన‌జీయ‌ర్ స్వామి, కేసీఆర్ మ‌ధ్య ఆ ప్రొటోకాల్ వివాదం దూరం పెంచింది. తాజాగా యాదాద్రి స్వ‌యంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శన ప్రారంభోత్సవానికి ఎంపీ , ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు ఆహ్వానం లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దంప‌తుల‌తో పాటు రాష్ట్ర‌ మంత్రులు ప‌లువురు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అయితే, స్థానిక ఎంపీగా ఉన్న త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డంపై కాంగ్రెస్ నేత‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అవుతున్నాడు.యాదాద్రి పునఃప్రారంభం విష‌యంలో తెలంగాణ సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్వీట్ చేయ‌డం సోష‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైయింది.

ముచ్చింత‌ల్ స‌మతామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్ల‌ను ఆహ్వానించ‌లేదు. కేవ‌లం బీజేపీ, టీఆర్ఎస్ లీడ‌ర్ల‌ను మాత్ర‌మే ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీని శైవుల పార్టీగా చిన జీయ‌ర్ భావించాడేమోన‌ని సెటైర్ వేశాడు. అంతేకాదు, కేసీఆర్ సూచ‌న మేర‌కు కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్ల‌ను చిన‌జీయ‌ర్ ఆహ్వానించ‌లేద‌ని కూడా ఆరోపించాడు. ఆ కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లోనే కేసీఆర్, చిన‌జీయ‌ర్ కు మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో ప్ర‌స్తుతం యాదాద్రి ద‌ర్శ‌నం ప్రారంభానికి చిన‌జీయ‌ర్ ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆహ్వానించలేదు. వాస్త‌వంగా తొలి నుంచి చిన‌జీయ‌ర్ సూచ‌న మేర‌కు యాద‌గిరిగుట్ట‌ను యాదాద్రిగా నామ‌క‌ర‌ణం చేయ‌డంతో పాటు పున‌ర్నిర్మాణం డిజైన్ ను కూడా త‌యారుచేయించాడు. రెండుమూడుసార్లు యాదాద్రి నిర్మాణ ప‌నులను కేసీఆర్ తో క‌లిసి చిన‌జీయ‌ర్ ప‌రిశీలించాడు. కొన్ని మార్పుల‌ను కూడా చేయించాడు. తీరా, యాదాద్రి ప్రారంభోత్స‌వానికి జీయ‌ర్ కు ఆహ్వానం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి సర్వం సిద్ధమయింది. ఈ మహా క్రతువుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సతీస‌మేతంగా హాజ‌ర‌య్యాడు. యాదాద్రి ప్రధానాలయం స్వర్ణ శోభితంగా మారింది. భక్తులకు యాదాద్రి నృసింహుడు సోమ‌వారం నిజరూప దర్శనం భ‌క్తుల‌కు ఇవ్వ‌నున్నాడు. ఆరేళ్లుగా ఎదురు చూసిన‌ యాదాద్రి నరసింహుని దివ్వదర్శనం సోమ‌వారం నుంచి భక్తులకు కలుగనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. పర్యాటకులను ఆకట్టుకునేలా వివిధ ఆలయాల శిల్పకళా శైలీ ఉంది. ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిభక్తునిగా సోమవారం పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది.ఈ మహా క్రతువుకు సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజ‌ర‌య్యారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు సందడిగా మారాయి. మహా సంప్రోక్షణ మహోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

కన్నులపండువగా పంచశయ్యాధివాసం
పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం కన్నులపండువగా జరిగాయి. శాస్ర్తోక్తంగా 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. కలశాల్లో పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలను నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ, విష్వక్సేన, ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో షోడశకళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం పర్వాలను నిర్వహించినట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్‌ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం కొనసాగింది.ఈ మహోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 400 సీసీ కెమెరాలు, మూడు వేల పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఆ మేర‌కు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ ప్ర‌కటించాడు.

 

సీఎం కేసీఆర్ తో సహా ప్రముఖులు సంప్రోక్షణ మహోత్సవానికి హాజ‌రైన క్ర‌మంలో ఆక్టోప‌స్‌, గ్రేహౌండ్ బలగాలను రంగంలోకి దించారు. కొండపై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఉదయం 7.30 గంటల నుంచి: నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి జ‌రిగాయి. ఉదయం 9 గంటలకు: మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిథున లగ్న పుష్కరాంశమున గర్తవ్యాసము, రత్నవ్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం జ‌రిగింది. ఉదయం 10 గంటలకు: బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర నిర్వ‌హించారు. మధ్యాహ్నం 11.55 గంటలకు: మిథునలగ్న సుముహూర్తాన మహా కుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి జ‌రిగింది. సోమ‌వారం సాయంత్రం 6 గంటలకు: శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్‌ సన్మానం, మహాదాశీర్వచనం ఉంటుంది. ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించారు. నేటితో బాలాలయంలో భక్తులకు దర్శనాలు ముగిశాయి. మూడు శతాబ్ధాల కిందటే రాతి నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇటుకలు, సిమెంటు వాడకం పెరిగి రాతిని వాడటం ఇబ్బందిగా భావిస్తున్నారు. వందల ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి పూర్తి రాతి నిర్మాణానికి యాదాద్రి వేదికైంది. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పనిచేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్‌ లాకింగ్‌ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్‌ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి యాద్రాద్రికి చేరుకున్నాడు. కుటుంబ స‌మేతంగా కేసీఆర్ అక్కడే బస చేశాడు. యాదాద్రి మూలమూర్తుల దర్శనభాగ్యం కోసం చూస్తున్న చూడాలన్న భక్తుల ఏడేళ్ల కోరిక నెరవేరింది. యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని అంచ‌నా వేస్తున్నారు.తెలంగాణ ప్ర‌భుత్వం అద్భుతంగా చేసిన ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ లీడ‌ర్ల‌ను ఆహ్వానించ‌డ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ప్రొటోకాల్ ను కూడా కేసీఆర్ స‌ర్కార్ ప‌క్క‌న పెట్టేసింది. ప్ర‌తిప‌క్షాన్ని క‌లుపుకుని వెళ్ల‌కుండా ఏక‌ప‌క్షంగా వెళుతుంద‌న‌డానికి ఇదో నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల వ‌ర‌కు స‌మ‌తామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ ప్రొటోకాల్ ర‌గ‌డ న‌డిచింది. కానీ, స‌మ‌తా మూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ ప్రైవేటు ప్రోగ్రామ్‌. అదే, యాదాద్రి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం. దీనికి విప‌క్షాల‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంతో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల‌ను కూడా ఆహ్వానించ‌క పోవ‌డం రాజ‌కీయంగా ర‌గ‌డ జ‌రుగుతోంది.