తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం పొడచూపింది. ఢిల్లీ వరకు ఆ వివాదం చేరిందని తెలుస్తోంది. మేడరం జాతర చివరి రోజు హెలికాప్టర్ విషయంలో ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఏర్పడింది. జాతరకు సీఎం కేసీఆర్ వెళతారని చెబుతూ గవర్నర్ కు హెలికాప్టర్ సౌకర్యాన్ని ప్రొటోకాల్ విభాగం తిరస్కరించింది. దీంతో రోడ్డు మార్గాన ఆమె మేడారం జాతరకు వెళ్లారు. ప్రొటోకాల్ ప్రకారం అక్కడి కలెక్టర్, ఎస్పీ రిసీవ్ చేసుకోవాలి. కానీ, ఆ విధంగా ఆహ్వానం లేకపోవడంతో రాజ్ భవన్ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. అంతేకాదు, గవర్నర్ కు జరిగిన అవమానంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.మేడారం జాతరలో గవర్నర్ తమిళిసైకి ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉంది. కానీ, వాళ్లిద్దరూ గైర్హాజర్ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. మేడారం ముగింపు రోజైన శనివారం ఉదయం 11.15 నిమిషాలకు గవర్నర్ మేడారం వెళ్తారని సీఎంవోకు తెలియచేశారు. ప్రయాణానికి హెలికాప్టర్ సమకూర్చాలని గవర్నర్ కార్యాలయం కోరింది. హెలికాప్టర్ ను సమకూర్చకపోవడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు రోడ్డు మార్గాన గవర్నర్ మేడారానికి వెళ్లారు.
అదేరోజు గవర్నర్ షెడ్యూల్ కు కొంచం ముందుగా సీఎం కేసీఆర్ జాతరకు వెళ్తున్నారని షెడ్యూల్ చేయడం జరిగింది. ప్రభుత్వం వద్ద ఒక హెలికాప్టర్ మాత్రమే ఉందని, అందుకే దానిని సమకూర్చలేమని ప్రొటోకాల్ విభాగం రాజ్ భవన్ కు సమాచారం ఇచ్చిందని తెలిసింది. ముందుగా హెలికాప్టర్‌లో మేడా రంకు సీఎం వెళ్తారనే షెడ్యూల్ అయిందని ప్రభుత్వం చెబుతోంది. ఆ తర్వాతే గవర్నర్ కార్యాలయం హెలికాప్టర్ కోరినందున సమకూర్చేలేకపోయామని ప్రభుత్వ ప్రొటోకాల్ కాల్ అధికారిక వర్గాలు అంటున్నాయి.ఇటీవల ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ పెరిగింది. గవర్నర్ కార్యాలయం ముందు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం కేసీఆర్ సర్కార్ కు ఏ మాత్రం నచ్చలేదు. కోవిడ్ పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేయడం మరో వివాదంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించిన అంశం ఢిల్లీకి చేరింది. మహాజాతరలో చివరి ఘట్టమైన దేవతల వనప్రవేశం రోజున(19న) దర్శనానికి గవర్నర్ ముందుగానే షెడ్యూల్ ఇచ్చారు. గవర్నర్ పర్యటనకు కొద్దిగంటల ముందే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఇతర అధికారులు మేడారం ‘సక్సెస్ మీట్’నిర్వహించారు. ఆ తర్వాత మేడారం చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జాయింట్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలకు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే సీతక్క వేర్వేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టుల ప్రాబల్యప్రాంతంలో గవ ర్నర్ పర్యటనను తేలికగా తీసుకోవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.