Site icon HashtagU Telugu

BJP MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై పాత‌బ‌స్తీలో నిర‌స‌న‌లు

Raja Singh

Raja Singh

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో నిర‌స‌న‌లు ప్రారంభ‌మైయ్యాయి. రాజాసింగ్‌పై దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహ్మద్ ప్రవక్త పై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్‌బుక్ పేజీలో వీడియోను రాజాసింగ్ అప్‌లోడ్ చేశార‌ని ఫిర్యాదులో పేర్కోన్నారు. భారీ భద్రత మధ్య శనివారం సాయంత్రం నగరంలో ఓ షో నిర్వహించిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీపై కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.
ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల వద్ద అనేక మంది ప్రజలు గుమిగూడి నిరసనలు ప్రారంభించారు. బషీర్‌బాగ్‌లోని కమిషనర్‌ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని నిరసన చేపట్టారు. భవానీనగర్‌, దబీర్‌పురా, నాంపల్లితో పాటు మరికొన్ని పోలీస్‌స్టేషన్ల వద్ద కూడా ఇదే తరహాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నగరంలో ఎలాంటి మత ఘర్షణలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లను, బలగాల మోహరింపును సీనియ‌ర్ పోలీస్ అధికారులు ప‌ర్య‌వేక్షించారు.

ఏఐఎంఐఎం మలక్‌పేట శాసనసభ్యుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఐపీసీ 153ఎ, 295, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టినట్లు సౌత్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఇదిలా ఉండగా గత రాత్రి జరిగిన ఘటనతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలోని అన్ని మతపరంగా సున్నితమైన ప్రాంతాలలో పోలీసు పికెట్‌లు ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద బైఠాయించిన జనాన్ని చెదరగొట్టారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.