Huzurabad : వాళ్లకు డబ్బులిచ్చి.. మాకెందుకు ఇవ్వరూ : నిరసనకారుల డిమాండ్

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు దగ్గరుండి మరి ప్రజాస్వామ్యాన్ని ఎన్నిరకాలుగా హత్య చేయొచ్చో అన్ని రకాలుగా హత్య చేస్తున్నారనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - October 29, 2021 / 11:32 AM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు దగ్గరుండి మరి ప్రజాస్వామ్యాన్ని ఎన్నిరకాలుగా హత్య చేయొచ్చో అన్ని రకాలుగా హత్య చేస్తున్నారనిపిస్తోంది.

మొదటినుండి భావిస్తున్నట్టే ఆ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. కోట్లాది రూపాయలు ప్రలోభాలకు గురవ్వడానికి ఎన్వలప్ కవర్లలో సిద్ధమైంది. పోటీలో ఉన్న పార్టీలు తమ అభ్యర్థుల ఫోటో, ఎన్నికల గుర్తు ముద్రించిన ఎన్వలప్ కవర్స్ లలో ఓటుకు ఇంత అని,వేలాది రూపాయలు పంచుతున్నారు. ఇలాంటి ప్రక్రియను అడ్డుకోవాల్సిన ప్రజలు నోటు ఇస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెపుతున్నారు. ఒక పార్టీ ఒక్కో ఓటుకు పదిహేను వేలు పంచితే, మరో పార్టీ ఒక్కో ఓటుకు 6వేల నుండి ఎనిమిది వేలు పంచుతోందట.

పంపకంలో సమానత్వం లేదని కొందరికి ఎక్కువ డబ్బులు పంచుతూ, తమకి తక్కువ డబ్బులు పంచుతున్నారని తమకు న్యాయం చేయాలని రోడ్లపై ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో కన్పిస్తోంది. ఇక ఎన్నికల కమీషన్ రోజుకి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల విలువచేసే మద్యం సీజ్ చేస్తున్నా ఆ ధన ప్రవాహం, మద్యం ప్రభావం మాత్రం తగ్గడమే లేదు.

ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి అస్సలు మంచిది కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోవడం ఎంతతప్పో అనే అంశంపై బుద్ధిజీవులు ఎంత ప్రచారం చేస్తున్నా ఓటర్లు మాత్రం అవకాశం పోతే మళ్ళీ రాదనే భావిస్తున్నారు. రానున్న కాలంలో పైసలు వేయకపోతే ఓటు ఎందుకు వేస్తామని తేల్చి చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో. ఎలాంటి ప్రత్యామ్నాయం వస్తే ఇలాంటి పరిస్థితిని మార్చగలమో బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది.