Minister Uttam: నీటిపారుదల శాఖలో జనవరి మాసాంతానికి పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) వెల్లడించారు. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్ నాథ్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈ. ఎన్.సి జనరల్ అనిల్ కుమార్, ఈ. ఎన్.సి ఓ& ఎం విజయభాస్కర్ రెడ్డిలతో వేసిన ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సుల మేరకే ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇంతకాలంగా న్యాపరమైన అడ్డంకులు ఉన్నందునే జాప్యం జరిగిందని వాటిని అధిగమించేందుకు ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. బుధవారం రోజున ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో తెలంగాణ ఏఈఈల అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈఎన్‌సీ అనిల్ కుమార్, హరేరాం, డిప్యూటీ ఈఎన్‌సీ శ్రీనివాస్‌లతో పాటు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ, సంఘం నేతలు బండి శ్రీనివాస్, నాగరాజు, సమర సేన్, సంతోష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దా కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్పులకు, వడ్డీలకే రూ. 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గడిచిన ప్రభుత్వం ఎక్కువ ఖర్చుచేసి తక్కువ ప్రయోజనం పొందిందని, ఆ ఫలితం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా పరిణమించిందన్నారు. అటువంటి నీటిపారుదల శాఖను సంవత్సరకాలంగా గాడిలో పెడుతున్నామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. మానవవనరులు, మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏఈఈలను నియమించడంతో పాటు 1800 మంది లష్కర్లను నియమించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మరో 1300 ఉద్యోగాల నియమాకాలకై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతిచ్చామన్నారు. యావత్ భారతదేశంలోనే ఇక్కడి నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రాంతంలోను ఇక్కడి ఇంజినీర్లు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు నిర్మించారన్నారు. ఆధునిక దేవాలయాలుగా బాసిల్లిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్ట్ లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదహరించారు. అటువంటి ఇంజినీర్లకు యువ ఇంజినీర్లు వారసత్వంగా ఎదగాలని ఆయన ఉద్బోధించారు. విధినిర్వహణలో సిన్సియారీటీ, నిబద్ధత, పారదర్శకత కనిపించాలని అటువంటప్పుడే ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ నీటిపారుదల శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. అటువంటి శాఖ ప్రతిష్ఠతను నిలిపేందుకు యువ ఇంజినీర్లు కృషి చేయాలన్నారు.