Priyanka Gandhi : వయనాడ్ లోకసభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ ఉపఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రియాంక గాంధీకి మంచి ఆధిక్యం లభిస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. వయనాడ్ ప్రజలు ఆమెకు రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక.. ఈ ఘన విజయంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో దూసుకెళ్తున్నారు. ఓట్లు లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నరు. ఇప్పటివరకు ఆమెకు మొత్తం పోలైన ఓట్లలో 2.26 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దీంతో తన సమీప అభ్యర్థి సీపీఐకి చెందిన సత్యన్ మొకేరిపై లక్షా 64 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు 70 వేల ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడోస్థానానికే పరిమితమయ్యారు. ఎన్నికల సమయంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆమె ప్రియాంకకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. ఆమెకు 43,352 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కాగా, గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్‌లోని 3.64 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే ఇప్పుడు ప్రియాంక, రాహుల్ గాంధీ రికార్డును అధిగమించేలా దూసుకెళ్తున్నారు. ఉపఎన్నికలో వయనాడ్‌లో 9.52 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు 3.5 లక్షల ఓట్లు మాత్రమే లెక్కించారు. మిగిలిన ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రియాంక గాంధీ ఆధిక్యం మరింత పెరుగనుంది.
Read Also: IPL 2025: ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్‌లో వారి బౌలింగ్ నిషేధం!