Priyanka Gandhi : మాణిక్ ఠాకూర్ ఔట్‌, తెలంగాణ ఇంచార్జిగా ప్రియాంక‌?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగుతోంది. ద‌క్షిణాది రాష్ట్రాల ఇంచార్జిగా ప్రియాంక‌ను నియ‌మించాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించింది.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 03:56 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగుతోంది. ద‌క్షిణాది రాష్ట్రాల ఇంచార్జిగా ప్రియాంక‌ను నియ‌మించాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించింది. త్వ‌ర‌లో జరిగే పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) భేటీ త‌ర్వాత ప్రియాంక పేరును అధికారికంగా ఖ‌రారు చేయ‌నున్నారు. ఆ మేర‌కు పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

ప్ర‌ధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో క‌ర్నాట‌క‌, తెలంగాణ మీద కాంగ్రెస్ ఆశ‌లు పెట్టుకుంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నానాటికీ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో బ‌ల‌హీన‌ప‌డుతోంది. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్రావ‌ణ్ పార్టీని వీడ‌డంతో పాటు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వాల‌కాన్ని ఏక‌ర‌వు పెట్టారు. అంతేకాదు,ప‌లుమార్లు ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు చేసిన విష‌యాన్ని కూడా వెల్ల‌డించారు. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌పై అధిష్టానం సీరియ‌స్ గా అధ్య‌య‌నం చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలు, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఒక‌టై ఏ విధంగా పార్టీకి న‌ష్టం చేస్తున్నారో దాసోజు ఆరోపించారు.

తెలంగాణ ఇంచార్జిగా ఉన్న మాణిక్ ఠాకూర్ రూ. 50కోట్లు తీసుకుని పీసీసీ గా రేవంత్ వైపు మొగ్గార‌ని ఆరోప‌ణ‌లు తొలి నుంచి ఉన్నాయి. ఆ క్ర‌మంలో తెలంగాణ పూర్తి బాధ్య‌త‌ల‌ను నేరుగా ప్రియాంక‌కు అప్ప‌గించేలా ఏఐసీసీ సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల‌కు పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ నియామ‌కం కానున్నారు. క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల పార్టీ శాఖ‌ల‌కు పూర్తి స్థాయి ఇంచార్జీగా ఆమె వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు, మునుగోడు ఎన్నిక‌ల‌ వేళ కాంగ్రెస్ పార్టీ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌లితంగా తెలంగాణ ఇంచార్జి మాణిక్ ఠాకూర్ కు చెక్ ప‌డ‌నుందన్న‌మాట‌.