Site icon HashtagU Telugu

Telangana Congress : `ప్రియాంక` ఫైన‌ల్ ట‌చ్, కాంగ్రెస్ కు వెంక‌ట‌రెడ్డి బైబై?

Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

కాంగ్రెస్ ఎంపీ, సీనియ‌ర్ లీడ‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని తేల్చ‌డానికి ఏఐసీపీ నిర్ణ‌యించుకుంది. ఆ మేర‌కు ఫైన‌ల్ మీటింగ్ వెంక‌ట‌రెడ్డితో నేరుగా ప్రియాంక భేటీ కానున్నారు. ఇటీవ‌ల తెలంగాణ బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షించడానికి రంగంలోకి దిగిన ఆమె తెలంగాణ కాంగ్రెస్ మీద తుది నిర్ణ‌యం తీసుకుని విదేశాల‌కు వెళ్ల‌నున్నారు.

హ‌డావుడిగా ఢిల్లీ వెళ్లిన కోమ‌టిరెడ్డి తొలుత పీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో లంచ్ మీట్ అవుతారు. ఆ త‌రువాత సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రియాంక‌ను క‌ల‌వ‌డానికి సిద్ధం అయ్యారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వేదిక‌గా తెలంగాణ సీనియ‌ర్ల‌తో ఆమె భేటీ నిర్వ‌హించారు. ఆ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి గైర్హాజ‌రు అయ్యారు. అంతేకాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వేదిక‌ను పంచుకోలేన‌ని రాత‌పూర్వ‌కంగా ఏఐసీపీకి స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ బాగుప‌డాలంటే, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొల‌గించాల‌ని లేఖ‌లో డిమాండ్ చేశారు. అంతేకాదు, రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మాణిక్ ఠాకూర్ ను కూడా తొలగించాల‌ని సూచించారు. ఆయ‌న స్థానంలో క‌మ‌ల్ నాథ్ లాంటి సీనియ‌ర్ల‌ను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా నియ‌మించాల‌ని కోరారు. రెండు రోజుల క్రితం జ‌రిగిన మీటింగ్ ప్రియాంక ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఆ భేటీకి వెంక‌ట‌రెడ్డి డుమ్మాకొట్ట‌డాన్ని ఆమె సీరియ‌స్ గా తీసుకున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

ఆ రోజున మీటింగ్ కు డుమ్మా కొట్టిన వెంక‌ట‌రెడ్డికి ప్ర‌త్యేకంగా టైం ఇచ్చిన ప్రియాంక క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. అందుకే, ఆమెతో భేటీ కావ‌డానికి ముందుగా ఉత్త‌మ్ తో లంచ్ చ‌ర్చ‌ల‌ను వెంక‌ట‌రెడ్డి జ‌రిపారు. ఏఐసీసీ ప్ర‌స్తుతం మునుగోడు బాధ్య‌త‌ల‌ను రేవంత్ రెడ్డికి పూర్తిగా అప్ప‌గించింది. ఆయ‌న్నే ఒకానొక సంద‌ర్భంలో మునుగోడు బ‌రిలో నిల్చోవాల‌ని ప్రియాంక్ సెటైరిక్ గా సమావేశంలో మాట్లాడిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. కానీ, చ‌ల‌మల కృష్ణారెడ్డిని నిలపాల‌ని రేవంత్ రెడ్డి సూచిన‌ట్టు తెలుస్తోంది. అదే ఫైన‌ల్ గా ఏఐసీపీ నిర్థారించ‌డానికి అవకాశంది. అందుకే, బ‌హుశా ప్రియాంక్ ఫైన‌ల్ ట‌చ్ ఇవ్వ‌డానికి వెంక‌ట‌రెడ్డికి అవ‌కాశం ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆమెతో భేటీ అయిన త‌రువాత వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి స‌ర్దుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఫ‌లితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయ‌కునిగా ఉంటార‌ని ఆయ‌న అభిమానుల ఉవాచ‌.