Site icon HashtagU Telugu

BJP: తెలంగాణకు ఏం చేశారో చెబుతూ.. టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ

Modi Meeting

Modi Meeting

ఆరు నూరైనా సరే బీజేపీ లక్ష్యం ఒకటే.. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే.. కమలనాథుల ఆశయం ఒకటే.. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తేవడం. రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభ ద్వారా ఆ విషయం సుస్పష్టమైంది. అందుకే మోదీ ప్రసంగమంతా తెలంగాణ చుట్టూ తిరిగింది. తెలంగాణకు ఏం చేశామో, ఏం చేస్తున్నామో, ఏం చేస్తామో ఆయన వివరంగా చెప్పడంతో బీజేపీ ఉద్దేశం ఒకటే అని తేలింది.

ఇక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి వీలుగా తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ లో అనేక ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. దీంతో టీఆర్ఎస్ కు పరోక్షంగా ఝలక్ ఇచ్చినట్టయ్యింది. ఇక్కడి ఫ్లైఓవర్లను తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు మంత్రులంతా ప్రారంభిస్తున్నారు. అంటే వాటిని తెలంగాణ ప్రభుత్వమే నిర్మిస్తోంది అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు మోదీ తన ప్రసంగంలో వాటి గురించి ప్రస్తావించడంతో టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

తెలంగాణలో రూ.35 వేల కోట్లతో భారీ ప్రాజెక్టులు చేపట్టామన్న మోదీ.. తమ పాలనలో ఈ గడ్డపై రెండు రెట్లుగా హైవేలను పెంచామన్నారు. రామగుండం ఎరువుల పరిశ్రమను పునరుద్దరించామని.. పంటలకు కనీస మద్దతు ధరను పెంచామని చెప్పారు. మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దీంతో తెలంగాణకు తాము ఏమేం చేశామో స్పష్టంగా చెప్పినట్లయింది.

ఈ సమావేశాలకన్నా ముందు హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా ఆయన తెలంగాణలో కుటుంబ పాలనపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో తమ అభివృద్ధిని ఏకరువు పెట్టారు. దీంతో ఈ ప్రాంతంలో తమ పార్టీ విజయానికి బీజేపీ ఏ స్థాయిలో కృషి చేస్తోందో అర్థమవుతోంది. ఇప్పుడు దీనికి టీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Exit mobile version