Kavitha : బీసీల హక్కులు, రాజ్యాధికారం కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరోసారి తమ ఆందోళనకు పదును పెట్టారు. బీసీ బిల్లు ఎంత ముఖ్యమో దేశానికి తెలియజేయడానికి, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేపట్టనున్నట్టు ఆమె ప్రకటించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో రాజకీయ పార్టీలు సీరియస్‌గా ఉండాలని కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. కానీ అసలైన పని చేయడంలో మాత్రం వెనకడుగేస్తోంది. బీసీ బిల్లు కోసం నిజమైన చిత్తశుద్ధి ఉంటే, వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, ఢిల్లీకి తీసుకెళ్లాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాక, కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీ పార్టీ కూడా బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పించుకుంటోందని మండిపడ్డారు. ఇది బీసీల భవిష్యత్‌కు సంబంధించిన అంశం. అటువంటి సమయంలో బీజేపీ నాయకులు మౌనంగా ఉండటం శోచనీయం అని విమర్శించారు.
అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి.. అధికారికంగా తీసుకెళ్లాలి.. కవిత డిమాండ్
బీసీలకు రాజ్యాధికారం రావాలంటే, బీసీ బిల్లును సాధించడమే దారి అని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మన అజెండా స్పష్టంగా ఉండాలి అన్నారు. తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్‌తోనే 2018లో పంచాయతీరాజ్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. తమిళనాడు ప్రభుత్వంలా, గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లాలి. కానీ తెలంగాణలో పెండింగ్ బిల్లుపై ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీతో ఉన్న మౌన ఒప్పందం వల్లే కోర్టుకు వెళ్లడం లేదని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో కేసు వేయండి..రాష్ట్ర ప్రభుత్వానికి సూచన
గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. తమిళనాడులో ఇటువంటి పరిస్థితిలో కోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు స్పష్టం కావాలి. మేమే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రావాలి అంటూ కేవలం మాటలతో కాదు, కృతిశీలంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఏమైనా సత్రం భోజనమా? అన్నట్టు మాట్లాడకండి. బీసీ బిల్లుపై బాధ్యతాయుతంగా వ్యవహరించండి అని ఆమె హితవు పలికారు. అఖిలపక్షాల మద్దతుతో దిల్లీకి వెళ్లాలని, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయాలని కవిత స్పష్టంగా సూచించారు. ఇది బీసీల పక్షాన పోరాటం కాదు, దేశ ప్రజాస్వామ్యానికి అద్దం పడే ఉద్యమం అని కవిత పేర్కొన్నారు.