తెలంగాణ గడ్డ రాజకీయ సభలతో దద్దరిల్లుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయమున్నా ఇప్పటినుంచే పోటాపోటీగా భారీ సభలు పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో సభ పెట్టింది. దీనికి రాహుల్ గాంధీని రప్పించింది. అందుకే లక్షల మంది సభకు వచ్చేలా చూసింది. దీంతో ఇప్పుడు బీజేపీపై ఒత్తిడి పెరిగింది. తమకు కూడా జనబలం ఉందని ప్రజలు నమ్మాలంటే.. కచ్చితంగా వరంగల్ సభకన్నా ఎక్కువమంది . తమ సభకు రావాలని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ఈనెల 14న బండి సంజయ్ నిర్వహిస్తు్న్న ప్రజాసంగ్రామ యాత్ర-2 ముగింపు సభకు అమిత్ షా వస్తున్నారు. ఈ సభకు భారీగా జనాన్ని సేకరించే పనిలో పడ్డాయి పార్టీ శ్రేణులు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభపై పార్టీ శ్రేణులు.. సంతృప్తిగానే ఉన్నా.. అమిత్ షా మీటింగ్ ను జయప్రదం చేయడం సవాల్ గా తీసుకుంది. అందులోనూ తెలంగాణ బీజేపీకి సంబంధించి ఎన్నికల ఎజెండా ప్రకటన, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని పార్టీ శ్రేణులకు చెప్పబోతున్నారు అమిత్ షా. అందుకే ఈసారి షా రాకను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అమిత్ షా పాల్గొనే సభ మహేశ్వరంలోని తుక్కుగూడ వద్ద జరుగుతుంది. అందుకే ప్రతీ పోలింగ్ బూత్ నుంచి 20 మందిని తరలించేలా స్కెచ్ వేసింది. నియోజకవర్గానికి కనీసం ఐదు వేల మందినైనా సభకు రప్పించేలా పార్టీలు వర్గాలు ప్లాన్ చేశాయి. రాహుల్ గాంధీ సభకంటే అమిత్ షా సభకే జనం ఎక్కువ వచ్చారు అని ప్రజలు అనుకునేలా చేయాలని పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే సూచనలు అందినట్లు తెలుస్తోంది.
దూర ప్రాంతాల నుంచి 1000-5000 వరకు, హైదరాబాద్ సమీప జిల్లాలు, మండలాల నుంచి 5-10 వేల వరకు ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ.