రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Murmu ) రేపు హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు. ఈ క్రమంలో నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నల్సార్ యూనివర్సిటీలో జరిగే 21వ స్నాతకోత్సవానికి ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉన్నంత అధికారులు సమావేశమయ్యారు.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఇక పోలీస్ శాఖ, బ్లూ బుక్ ప్రకారం రాష్ట్రపతి టూర్ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమన్వయం, బందోబస్త్ లాంటివి ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఇక 8 రాష్ట్రాలకు సంబంధించిన స్టాళ్లను, 4 ఫుడ్ కోర్టులను, మీడియా సెంటర్ ను, ఇతరత్రా స్టాళ్లను అధికారులు పరిశీలించారు.
శనివారం ఉదయం 11:50 గంటలకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట్ చేరుకుంటారు రాష్ట్రపతి. అక్కడ ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం 12:20కి నల్సార్ యూనివర్సిటీలో జరిగే 21వ స్నాతకోత్సవానికి ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నం 3:30కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్-2024ను ముర్ము ప్రారంభిస్తారు. సాయంత్రం 5:45కు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరిగి దిల్లీకి తిరుగు పయనమవుతారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, తివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. అందువల్ల ఈ మార్గాల్లో రహదారులపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండనుందని పోలీసులు తెలిపారు.
Read Also : Tirumala Laddu Issue : వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు..? – జగన్