President Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెలలో మరోసారి హైదరాబాద్ పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఆమె నగరంలో పర్యటించనున్నారు. ‘లోక్ మంథన్ – భాగ్యనగర్ 2024’ పేరుతో నవంబరు 22న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ భక్తిశ్రద్ధలతో పాటిస్తున్న ప్రాచీన విదేశీ తెగల వారు కూడా పాల్గొననున్నారు. ఇరాన్, టర్కీ దేశాల సరిహద్దుల్లో ఉండే కుర్దిస్తాన్ ప్రాంతంలో నివసించే ‘యజీదీ’ తెగవారిని ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ ఈవెంట్‌లో యజీదీ తెగవారు తమ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే కళా ప్రదర్శనలతో అలరించనున్నారు. సూర్య నమస్కారం, సూర్యుడికి పూజలు, ప్రకృతి శక్తుల ఆరాధన వంటి భావనలు యజీదీ తెగలోనూ(President Droupadi Murmu) ఉన్నాయి. యజీదీ తెగకు సంబంధించిన ఆచారాలు చాలా ప్రాచీనమైనవని చెబుతుంటారు. యజీదీ తెగ వారిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో చాలాసార్లు తీవ్రదాడులకు పాల్పడ్డారు. ఎంతోమంది యజీదీలను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ప్రాణాలు తీశారు. అయినా యజీదీ తెగవారు తమ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ పాటిస్తూ ముందుకు సాగుతున్నారు.
Also Read :New Degree Syllabus : విద్యార్థులకు జాబ్ సాధించి పెట్టేలా డిగ్రీ కొత్త సిలబస్
ఈ ఈవెంట్‌లో భాగంగా కాకతీయ, విజయనగర, కర్ణాటకకు చెందిన జనపద సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ, ఏపీ సహా దాదాపు 10 రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయి. ఆయా పెవిలియన్లలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారు. ఈ ఈవెంటులో భాగంగా దాదాపు 125 రకాల కళా రూపాలను ప్రదర్శించనున్నారు. మళయాలం నటి, కూచిపూడి డ్యాన్సర్ రచనా నారాయణ కుట్టి ఈసందర్భంగా నృత్య ప్రదర్శన చేయనున్నారు. కశ్మీరీ శైవ తత్వం ఆధారంగా ఈ నృత్య ప్రదర్శన ఉంటుంది. తెలంగాణ కళాకారుల జుగల్‌బందీ ఈవెంట్ ఒకటి ఉంటుంది. ఆర్మేనియా కళాకారుల సంగీత ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖుల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.