రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) మంగళవారం హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరుకానున్నారు. ఉదయం 10గంటలకు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకుంటారు. అక్కడి నుండి రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్ర హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని సహకరించాలని నగర పోలీసులు కోరారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్టు, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్ కుంట ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అటువైపుగా వెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
అదేవిధంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బొల్లారం, అల్వాల్, లోత్‌కుంట, త్రిముల్‌ఘేరి, కార్జానా, జేబీఎస్, ప్లాజా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్ రూట్లలో వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను హెచ్‌పీఎస్ అవుట్ గేట్, బేగంపేట్ ప్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్ మోనప్ప జంక్షన్, ఎన్ ఎఫ్‌సీఎల్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు మళ్లించనున్నారు.