Site icon HashtagU Telugu

Prashant Kishor : తెలంగాణ‌పై ‘పీకే’ మార్క్

Pk Mark

Pk Mark

తెలంగాణ రాజ‌కీయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య కుట్ర వేడెక్కిస్తోంది. హుజ‌రాబాద్ ఉప ఫ‌లితాల త‌రువాత టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ వరి ధాన్యం విష‌యంలో గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు జ‌రిగింది. ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించిన జీవో నెంబ‌ర్ 317 విష‌యంలోనూ ఆ రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయం భ‌గ్గుమంది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ను క‌రీంన‌గ‌ర్లో అరెస్ట్ చేయ‌డంతో ఆనాడు సీఎం కేసీఆర్ పై బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు విరుచుకు ప‌డ్డారు. త్వ‌ర‌లోనే కేసీఆర్ అరెస్ట్ ఖాయ‌మంటూ బండి ప‌లుమార్లు వార్నింగ్ ఇచ్చాడు. ట‌చ్ చేడండంటూ ప్ర‌తిగా గులాబీ ద‌ళం ఫైర్ అయింది.వ్యూహాత్మ‌కంగా జాతీయ స్థాయి రాజ‌కీయాల‌ను తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా బీజేపీ రాజ‌కీయ దాడి నుంచి కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా త‌ప్పుకున్నాడు. ఆయ‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రోజే బీజేపీ నేత జితేంద్ర‌రెడ్డి ఇంట్లో కిడ్నాప్ క‌ల‌క‌లం రేగింది. ఆ మేర‌కు ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కిడ్నాప్ క‌థ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య కు సుఫారీ వైపు మ‌ళ్లింది. జితేంద్ర‌ర్ రెడ్డి కారు డ్రైవ‌ర్ థ‌పాతో పాటు న‌లుగుర్ని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి పేట్ బ‌షీర్ బాగ్ స్టేష‌న్ కు తీసుకొచ్చి విచారించ‌గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కుట్ర కోణం బ‌య‌ట‌ప‌డింది.

ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోన్న ప‌రిస్థితుల్లో శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌ కుట్ర అంశం బీజేపీ,టీఆర్ఎస్ మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ యుద్ధానికి ఆజ్యం పోసింది. మంత్రి హ‌త్య‌కు కుట్ర చేసిన వాళ్ల‌లో మున్నూరు ర‌వి అనే వ్య‌క్తి బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డికి చెందిన ఢిల్లీలోని ఇంటిలో ఆశ్ర‌యం పొందాడు. నిందితుడుగా భావిస్తూ ర‌విని ఢిల్లీలోని జితేంద్ర‌రెడ్డి ఇంట్లో అరెస్ట్ చేశారు. దీంతో హ‌త్య కుట్ర‌లో జితేంద‌ర్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన మ‌హిళా నేత డీకే అరుణ‌ల‌ పాత్రపైనా తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేర‌కు ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించాడు.ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగంగా జ‌రుగుతోన్న డ్రామాగా భావిస్తూ స‌మ‌గ్ర ద‌ర్యాప్తు కోసం సీబీఐని రంగంలోకి దింపాల‌ని జితేంద్ర‌రెడ్డి కోరుతున్నాడు. ఒక‌వేళ టీఆర్ఎస్ స‌ర్కారుకు సీబీఐపై న‌మ్మ‌కం లేక‌పోతే న్యాయ విచార‌ణ అయినా జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. చాలా ఏళ్లుగా జితేంద్ర‌రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మీద ప్రత్యేకంగా బ‌ల‌మైన ఆరోప‌ణ‌లు లేవు. అదే విష‌యాన్ని ఆయ‌న చెబుతూ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి ఎవ‌రు ఢిల్లీ వ‌చ్చినా ఆశ్ర‌యమించే ఆన‌వాయితీ ఎప్ప‌టి నుంచో ఉంద‌ని తెలిపాడు. అందుకే ర‌వికి కూడా ఆశ్ర‌యం ఇచ్చాన‌ని వివ‌రించాడు. నిందితుడు మున్నూరు ర‌వి ప్ర‌తి వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌నూ క‌లుస్తుంటాడ‌నే విస‌యాన్ని కూడా జితేంద్ర‌రెడ్డి గుర్తు చేశాడు.

మొత్తం మీద మ‌హబూబ్ న‌గ‌ర్ రాజ‌కీయాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా మంత్రిపై సుఫారి వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అయింది. డైన‌మిక్ ఆఫీస‌ర్ గా పేరున్న స్టీఫెన్ ర‌వీంద్ర నిజంగా జితేంద్ర‌రెడ్డి, డీకే అరుణ‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తాడా? అనే టాక్ పోలీస్ స‌ర్కిల్స్ లో న‌డుస్తోంది. మొత్తం మీద మంత్రిపై హ‌త్య కుట్ర తెలంగాణ పాలిటిక్స్ ను ఊపేస్తుండ‌గా, రాజ‌కీయ స‌ల‌హాదారుగా పీకేను నియ‌మించిన వెంట‌నే ఈ సంఘ‌ట‌న వెలుగుచూడ‌డం ప‌లు అపోహ‌ల‌కు దారితీస్తోంది. ఆయ‌న రాజ‌కీయ వ్యూహక‌ర్త‌గా ఎక్క‌డ ప‌నిచేసినా, ఇలాంటి సంఘ‌ట‌న‌లు పొడ‌చూడం చూశాం. బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌త‌కు కాలు ప్ర‌మాదం, 2019 ఏపీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పై కోడి క‌త్తి దాడి జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు తెలంగాన‌లో మంత్రి గౌడ్ పై హ‌త్య కుట్ర వెలుగు చూడ‌డం పీకే వ్యూహంలో భాగమేనా? అనే ప్ర‌శ్న కూడా ఉద‌యిస్తోంది.