Site icon HashtagU Telugu

Prashant Kishor : కాంగ్రెస్, పీకే పొలిటికల్ గేమ్.. మరి బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏమిటి?

Prashant

Prashant Kishor

కాంగ్రెస్, బీజేపీలు రాజకీయాల్లో ఆరితేరిపోయాయి. 2014 నుంచి బీజేపీ తన రూటు మార్చుకోవడంతో వరుసగా ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ మాత్రం మూస రాజకీయాలతో మంచానపడింది. కాకపోతే 2014లో బీజేపీని ఆ స్థాయిలో నిలబెట్టింది మాత్రం ప్రశాంత్ కిషోరే. అందుకే అదే పీకేపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆయనను పార్టీలోకి ఆహ్వానించి మళ్లీ కేంద్రంలో పవర్ లోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరి ఇదంతా చూస్తూ.. బీజేపీ ఊరుకుంటుందా? ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేయబోతోంది?

బీజేపీ గురించి చెప్పాలంటే 2014కు ముందు వేరు. ఇప్పుడు వేరు. గతంలో ఆ పార్టీకి సంస్థాగతంగా కార్యకర్తల బలం ఉన్నా.. దానిని సమర్థవంతంగా ఉపయోగించుకుని అధికారంలోకి రావడంలో వెనుకబడింది. కానీ 2014లో మోదీ, అమిత్ షాలు సోషల్ ఇంజనీరింగ్ ను అమలు చేయడం, పీకే వ్యూహాలను పన్నడంతో అన్నీ ఒక్కసారిగా కలిసొచ్చాయి. కమలాన్ని వికసించేలా చేశాయి. ఆ తరువాత చాలా ఎన్నికల్లో ఇదే సూత్రాన్ని అమలు చేసింది బీజేపీ. కానీ పీకే సేవలు మాత్రం 2014 తరువాత అస్సలు ఉపయోగించుకోలేదు.

ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలరు.. ఎలాంటి వ్యూహాలను పన్నగలరు అన్నదానిపై బీజేపీకి పూర్తి ఐడియా ఉంది. అందుకే ఆయన సేవలను మళ్లీ కావాలనుకోలేదు. దీంతోపాటు ఎన్నికల తరువాత తన సొంత క్యాంపెయిన్ సంస్థను బీజేపీ ఏర్పాటు చేసుకుంది. అమిత్ షా కనుసన్నల్లోనే ఇది నడుస్తుంది. దీనికి కొంతకాలంపాటు పీకే శిష్యుడు సునీల్ కనుగోలు కూడా సేవలందించారు. తరువాత ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి బీజేపీయే దానిని రన్ చేస్తోంది. దాని సాయంతోనే సోషల్ క్యాంపైన్ ని నిర్వహిస్తుంది. ఇప్పటివరకు సక్సెస్ అయ్యింది.

వచ్చే ఎన్నికల కోసం కూడా బీజేపీ తన సొంత స్కెచ్ లపైనే ఆధారపడబోతోంది. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లోకి వెళ్లినా.. విపక్షాలన్నీ కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడి పోరాటం చేసినా సరే.. మళ్లీ బీజేపీయే గెలిచేలా అమిత్ షా ఇప్పటికే తగిన వ్యూహాలను సిద్ధం చేయడంతోపాటు అమలు చేస్తున్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే పీకే తో ఎలాంటి పరేషాన్ లేదంటున్నారు కమలనాథులు.

Exit mobile version