Prashanth Kishor Supports to Kalvakuntla Kavitha బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా కవిత కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలపై పీకేతో కవిత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ విధివిధానాల కోసం 50 కమిటీలను ఏర్పాటు చేసిన కవిత.. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- కల్వకుంట్ల కవిత కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్
- రాజకీయ వ్యూహకర్తతో కవిత వరుస భేటీలు..!
- కొత్త పార్టీ ప్రారంభానికి ముందు కీలక పరిణామాలు
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. ఆ పార్టీ సీనియర్ నాయకులపై వరుస విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ కవిత ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం ఉందని.. తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కవిత కొత్త పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం.
రంగంలోకి దిగిన పీకే..
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ అవసరం ఉందని ఇటీవల చెప్పిన కల్వకుంట్ల కవిత.. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. 2029లో ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తరఫున పోటీ చేస్తామన్నారు. అందులో భాగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలకు పదును పెట్టేందుకు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు కవిత. దాదాపు రెండు నెలల్లో రెండుసార్లు పీకే హైదరాబాద్ వచ్చి.. కవితతో బేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? పార్టీ ఏర్పాటు చేశాక ఎలా ముందుకెళ్లాలి ? ఎలాంటి వ్యూహాలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా వీరిద్దరు సమావేశం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కవిత గానీ.. తెలంగాణ జాగృతి ప్రతినిధులు గానీ అధికారికంగా స్పందించలేదు.
కాగా, పార్టీ విధివిధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు పీకే కూడా రంగంలోకి దిగారు. దీంతో త్వరలోనే కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రశాంత్ కిశోర్ గతంలో ఏపీ మాజీ సీఎం జగన్‌కు, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్‌కు కూడా పని చేశారు. అంతేకాకుండా తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం పార్టీకి కూడా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. అయితే కవిత, పీకే వ్యూహాలు ఎంతమేర ఫలిస్తాయో వేచి చూడాలి.
తెలంగాణ సెక్యులర్ పార్టీకి మద్దతు ఇవ్వండి..
మరోవైపు, మనుగడ సాగించలేకపోయిన మావోయిస్టు సానుభూతిపరులకు, మావోయిస్టులు, మైనార్టీలకు కవిత ఇటీవల ఆహ్వానం పలికారు. తనతో కలిసి నడవాలని కోరారు. అటు బీసీలపైనా తన గొంతు వినిపిస్తున్నారు కవిత. యువతకు జాగృతి మంచి రాజకీయ వేదిక అవుతుందని అన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు స్థానం కల్పిస్తూ.. తెలంగాణ సెక్యులర్ పార్టీకి మద్దతు ఇవ్వండని కోరారు.
