Prakash Raj : దేశంలో బీజేపీని, తెలంగాణలో కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ (Prakash Raj) కేసీఆర్ పట్ల, కేటీఆర్ పట్ల తనకున్న స్నేహ బంధాన్ని ఆ టాక్ షోలో బహిరంగంగానే చెప్పారు.

  • Written By:
  • Updated On - November 14, 2023 / 05:13 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Prakash Raj : మంచి నటుడుగా కేసీఆర్ అంటే నాలాగే ఎంతోమందికి ఎంతో అభిమానం. గౌరీ లంకేష్ హత్య తర్వాత దేశంలో హిందుత్వ అతివాదం పట్ల తీవ్రంగా స్పందిస్తూ, దేశంలో కొనసాగుతున్న విద్వేష రాజకీయాల పట్ల తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటిస్తున్న ప్రకాష్ రాజ్ అంటే నాకు మరింత అభిమానం పెరిగింది. నాలాగే దేశంలో లౌకిక భావాలను ప్రేమించే వారికి, విద్వేష రాజకీయాలను ద్వేషించే వారికి కూడా ప్రకాష్ రాజ్ (Prakash Raj) అంటే అమితమైన ఇష్టం ఏర్పడింది. అయితే నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన టాక్ షోలో ప్రకాష్ రాజ్ మాటలు విన్న తర్వాత ఆయన పట్ల అభిమానం అలాగే ఉన్నప్పటికీ, ఆయన ఆలోచనల విషయంలో కొంత అస్పష్టత ఉన్నట్టుగా అనిపించింది.

వ్యక్తులుగా మనం ఎవరితోనైనా స్నేహ సంబంధాలు కొనసాగించవచ్చు. రాజకీయ సిద్ధాంతాలకు, భావజాలానికి, తాత్విక చింతనకు అతీతంగా మన స్నేహాలు ఉంటాయా అంటే అలా కూడా ఉండవచ్చు అని కొన్ని ఉదాహరణలు మనం చూపించవచ్చు. ప్రకాష్ రాజ్ (Prakash Raj) కేసీఆర్ పట్ల, కేటీఆర్ పట్ల తనకున్న స్నేహ బంధాన్ని ఆ టాక్ షోలో బహిరంగంగానే చెప్పారు. అయితే మిత్రత్వం వేరు రాజకీయాలు వేరు. మిత్రులు స్నేహపూర్వకంగా కలుస్తారు. అలా కలవడం వారి వారి రాజకీయ సిద్ధాంతాలు కలిసినట్టుగా చెప్పలేం. ఎవరి సిద్ధాంతాలు వారికే ఉంటాయి. కానీ ప్రకాష్ రాజ్ నిన్న మాట్లాడిన మాటలలో కొంత అస్పష్టత చోటుచేసుకుంది.

We’re Now on WhatsApp. Click to Join.

కేసిఆర్ కుటుంబం పట్ల తన స్నేహాన్ని ప్రకటించడం వేరు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే దిక్కని, మరొకరి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే అది నాశనం అవుతుందన్న తీరులో ఆయన మాట్లాడారు. తాను ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొననని, అది తనకు ఇష్టం లేదని, అలా పాల్గొనమని కేసీఆర్, కేటీఆర్ కూడా తనను కోరరని ఆయన చెప్పారు. అయితే ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈ టాక్ షోలో మాట్లాడిన మాటలన్నీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ ఏం చెబుతుందో అదే అర్థం వచ్చేటట్టు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయాల పట్ల ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వేషభూషాదులు, నటనా విన్యాసాల గురించి ఆయన చాలా కామెంట్లు చేశారు. భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ పట్ల ప్రకాష్ రాజ్ (Prakash Raj) చాలా సానుకూలమైన, ప్రశంసాపూర్వకమైన కామెంట్లు కూడా చేశారు. పప్పూ అని ఎద్దేవా చేయబడిన రాహుల్ ఇప్పుడు గొప్ప పరిణతి సాధించిన నాయకుడిగా ఎదిగారని ఆయన పొగిడారు.

దేశవ్యాప్త రాజకీయాలలో బిజెపికి వ్యతిరేకమైన స్టాండ్ ప్రకాష్ రాజు తీసుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దేశంలో జరుగుతున్న అనేక విషయాలలో, సందర్భాలలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్రకటించే భావాలు లౌకిక వాదులందరికీ సహజంగానే నచ్చుతాయి. దేశవ్యాప్తంగా విద్వేష రాజకీయాలు నడిపే వారికి వ్యతిరేకంగా సంఘటితమయ్యే శక్తుల పట్ల కూడా ప్రకాష్ రాజ్ కు సానుకూల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే విచిత్రంగా తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి ఆయన ఇక్కడ కేసిఆర్ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా సమర్థిస్తున్నారు. కేవలం స్నేహ ధర్మంగానే కాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, ఉద్యోగ ఉపాధులు తదితర అంశాలను ఆయన ప్రశంసించారు.

Also Read:  YV Subba Reddy : అప్పుడే పోటీ ఫై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

దేశంలో బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీని ఆయన సమర్థిస్తూ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఆయన వ్యతిరేకించడమే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కేసీఆర్ విజ్ఞత, విజన్ ఉన్న నాయకుడని, ఆయన ప్రధాని కావలసిన అర్హత ఉన్న వాడని ప్రకాష్ రాజ్ కీర్తించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి పట్ల చాలా వ్యతిరేక భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల విషయంలో ఒక రకమైన స్టాండు, తెలంగాణ విషయంలో ఒక రకమైన స్టాండ్ తీసుకొని ప్రకాష్ రాజు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. బిజెపికి దేశవ్యాప్తంగా వ్యతిరేక శక్తులు సంఘటితమవుతున్న ఈ తరుణంలో ఆ శక్తులను బలపరచడమే లౌకికవాద అభిప్రాయాలున్నవారు సహజంగా చేసే పని.

ఈ విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ తన స్నేహ ధర్మానికే ఎక్కువ విలువ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన సమర్థిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్, బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు అంటే, అలా రాదని ఆయన బల్ల గుద్ది చెబుతున్నారు. ఒకవేళ వస్తే తాను వ్యతిరేకిస్తానని కూడా చెప్పారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ దేశ వ్యాప్త రాజకీయాల పట్ల ఒక వైఖరితో, తెలంగాణ రాజకీయాల పట్ల మరొక వైఖరితో ఉండడం ఆయన అభిమానులలో కొంతైనా గందరగోళం ఏర్పడడానికి తావిస్తుందనే చెప్పాలి.

Also Read:  Telangana Polls 2023 : రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ – అసదుద్దీన్ ఒవైసీ