KA Paul : శంక‌ర్ర‌రావును మించిన పాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్ర‌జాశాంతిపార్టీ చీఫ్ కేఏ పాల్ రూపంలో సీబీఐ వేట పొంచి ఉందా? అంటే అవున‌నే అనుమానం క‌లుగుతోంది.

  • Written By:
  • Updated On - June 22, 2022 / 02:29 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్ర‌జాశాంతిపార్టీ చీఫ్ కేఏ పాల్ రూపంలో సీబీఐ వేట పొంచి ఉందా? అంటే అవున‌నే అనుమానం క‌లుగుతోంది. ఢిల్లీ వెళ్లిన పాల్ సీబీఐ డైరెక్ట‌ర్ ను క‌లిసి 9ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. రాత‌పూర్వ‌కంగా కొన్ని ఆధారాల‌ను కూడా జ‌త‌చేస్తూ ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.కాళేశ్వ‌రం నుంచి ప‌లు స్కీమ్ ల ద్వారా సంపాదించిన డ‌బ్బును దుబాయ్, సింగ‌పూర్, అమెరికా లాంటి దేశాల‌కు త‌ర‌లించార‌ని ఫిర్యాదులో ఆరోప‌ణ‌లు చేశారు. గ‌తంలోనూ ఇలాంటి ఆరోప‌ణ‌లు పాల్ చేసిన‌ప్ప‌టికీ పెద్ద సీరియ‌స్ గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ, గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంక‌ర‌రావు ఫిర్యాదు నేప‌థ్యంలో జ‌గ‌న్ మీద జ‌రిగిన సీబీఐ విచార‌ణ ఇప్పుడు గుర్తుకు వ‌స్తుంది.

అప్ప‌ట్లో సీఎంగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణించిన త‌రువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే శంక‌ర‌రావు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ విధంగా క్విండ్ ప్రో కో కింద అవినీతికి పాల్ప‌డ్డాడో తెలియ‌చేస్తూ ఓబులాపురం మైనింగ్ లాంటి ఆధారాల‌ను జ‌త చేశారు. ఆ సంద‌ర్బంలో కాంగ్రెస్ అధిష్టానం, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ధ్య వ‌చ్చిన గ్యాప్ కార‌ణంగా సీబీఐ విచార‌ణ జ‌రిగింది. ఆ విష‌యాన్ని సీనియ‌ర్ లీడ‌ర్ గులాంన‌బీ ఆజాద్ ఒక‌నొక సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద సీబీఐ విచార‌ణ కేసు కొన‌సాగుతోంది.

సేమ్ అటూ సేమ్ అప్ప‌ట్లో శంక‌ర‌రావు ఇచ్చిన ఫిర్యాదు త‌ర‌హాలోనే ఇప్పుడు పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ అక్ర‌మ ఆస్తుల మీద ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈడీ, సీబీఐకి తెలంగాణ సీఎం ఆస్తుల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఆ మేర‌కు కొన్ని ఆధారాల‌ను ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అంద‌చేశారు. అంతేకాదు, పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏఐసీసీ మెంబ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఆస్తుల‌పై ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఒక న్యాయ పోరాటం చేస్తూనే ఇంకో వైపు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఆధారాల‌ను అందించారు. కొన్ని వంద‌ల పేజీల డాక్యుమెంట్ల‌ను జ‌డ్స‌న్ అంద‌చేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు క‌ల్వ‌కుంట్ల కుటుంబం మీద తీసుకోలేదు.

కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌లు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అక్ర‌మాస్తుల గురించి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జైలులో పెడ‌తామ‌ని ప‌లుమార్లు హెచ్చ‌రించారు. వివిధ ర‌కాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా తర‌చూ తెలంగాణ‌కు వ‌స్తోన్న బీజేపీ పెద్ద‌లు క‌ల్వ‌కుంట్ల కుటుంబం అవినీతిపై ఆరోప‌ణ‌లు గుప్పించి వెళుతున్నారు. ఇదిగో అరెస్ట్ చేస్తామంటూ చెబుతూ నాన్చుడి ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో బీజేపీ పెద్ద‌లు చేస్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని అర్థం అవుతోంది. అంతేకాదు, కేసీఆర్ ను ట‌చ్ చేసి చూడండ‌ని టీఆర్ఎస్ స‌వాల్ చేస్తోంది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ కేఏ పాల్ సీబీఐకి 9 ల‌క్ష‌ల కోట్ల విలువైన అక్ర‌మాస్తులు కేసీఆర్ కుటుంబం వ‌ద్ద ఉన్నాయ‌ని ఫిర్యాదు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో శంక‌ర‌రావు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ విచార‌ణ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద చేసిన‌ట్టు ఇప్పుడు పాల్ ఫిర్యాదు ఆధారంగా కేసీఆర్ మీద సీబీఐ విచార‌ణ జ‌రుగుతుందా? అనే అనుమానం క‌లుగుతుంది.