తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇక ఇప్పుడు మిగతా హామీలను నెరవేర్చేందుకు గాను ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి తీసుకోబోతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ దరఖాస్తు పత్రాన్ని (Praja Palana Application Form) అధికారులే నేరుగా ప్రజలకు అందజేస్తారు. ఈ పత్రాన్ని ఎలా నింపటం.. దానికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం లాంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే.. వాటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం ను విడుదల చేసింది. అన్ని పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది. మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాలలో.. కుటుంబ యజమాని పేరుతో మొదలై.. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత.. వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఆ పథకం కింద అడిగిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
రైతు భరోసా కోసం.. లబ్ది పొందే వ్యక్తి రైతా, కౌలు రైతా టిక్ చేసి.. పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి ఏకరాలను పేర్కొనాలి. ఒకవేళ రైతు కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.
ఇక ఇందిరమ్మ ఇండ్లు పొందాలనుకునే వాళ్లు.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి. లేదా అమరవీరుల కుటుంబానికి చెందినవాళ్లయితే.. పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఒకవేళ ఉద్యమకారులైతే.. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, లేదా జైలుకు వెళ్లిన వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.
మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందెందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్కు పెట్టాల్సి ఉంటుంది. రూ.500 సబ్సీడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజన్సీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇక చేయూత పథకం పొందాలనుకునేవారు.. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి లేదా.. వాళ్లు వృద్ధులా, వితంతువుల, బీడీ కార్మికులా, చేనేత కార్మికులా అన్నది వాళ్లకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాల్సి ఉంటుంది. అన్ని అయ్యాక కింద.. దరఖాస్తు దారుని పేరు, సంతకం, తేదీ వేయాలి.
ఇక గృహ జ్యోతి పథకం కోసం.. నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారన్నది యూనిట్లలో పేర్కొనాల్సి ఉంటుంది. దానితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి.
ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్‌ను కూడా జతపర్చాల్సి ఉంటుంది. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి.. వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.
Praja Palana Application1
Praja Palana Application2
Praja Palana Application3
Praja Palana Application4
Read Also : Praja Palana : ప్రజాపాలన దరఖాస్తులపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు