Power Point Presentation: తెలంగాణ ప్రభుత్వం రేపు (శుక్రవారం) కుల గణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) ఇవ్వనుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలకు దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రజంటేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్‌లోని ప్రకాశం హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించనట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: RBI Bars Loans: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా?
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ మంత్రి దామోదర్ రాజా నర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొని ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
బీసీ సంఘాల అభినందనలు
కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి బీసీ సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. కుల గణనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌కు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, మంత్రి పొన్నంకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. బీసీలు చేస్తున్న పోరాటానికి స్పందించి కుల గణన పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పించడం, స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమగ్ర కులగణనలో నేటి వరకు పాల్గొనని వారిని ప్రత్యేకంగా గుర్తించి ఆన్ లైన్ విధానమే కాకుండా ఆఫ్ లైన్ పద్ధతిలో కూడా సర్వే నిర్వహించాలని వారు ప్రభుత్వానికి సూచించారు.