Site icon HashtagU Telugu

KTR: కర్ణాటకలో కరెంటు కోతలు.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్

KT Rama Rao

Telangana Minister KTR America Tour

KTR: ఎన్నో ఏళ్ల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు హామీలను అమలుపరిచే ప్రయత్నం చేస్తోంది. అయితే కరెంట్ కష్టాలను మాత్రం తొలగించలేకపోతోంది. దీంతో విద్యుత్ సబ్ స్టేషన్లు, కరెంటు ఆఫీసుల్ని రైతులు చుట్టుముడుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా కనీసం 5 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోచోట ఏకంగా మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీస్ ముందు పెట్టి నిరసన తెలిపారు. దీంతో  కర్నాటక కరెంటు కష్టాలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కరెంటు సరఫరాలో కాంగ్రెస్ అసమర్థత.. తెలంగాణ రైతులకు అనుభవంలో ఉన్న విషయమేనన్నారు కేటీఆర్. దశాబ్దాలపాటు ఆ కష్టాలు వారు అనుభవించారని, ఇప్పుడు కొత్తగా కర్నాటక ప్రజలకు ఆ కష్టం తెలిసొచ్చిందని చెప్పారు. కర్నాటకలో రైతులు కరెంటు కోసం చేపట్టిన నిరసనల వీడియోలను ఆయన పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

గతంలో కరెంటు గురించి రేవంత్ మాట్లాడిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేయడంతో రేవంత్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ పై కాంగ్రెస్ ఏవిధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.