Vemula Prashanth Reddy: వర్షాలు పడుతున్నాయి.. ప్రయాణాలు వాయిదా వేసుకోండి

రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హితవు పలికారు.

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 06:11 PM IST

ఏకధాటిగా భారీ వర్షాలు కురియడంతో అనేకచోట్ల చెరువు కట్టలు తెగి రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న దృష్ట్యా మరో రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హితవు పలికారు. రహదారుల పై నుండి నీరు ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ఎంతమాత్రం రోడ్డును దాటే ప్రయత్నం చేయవద్దని జాగ్రత్తలు సూచించారు. మూడవ రోజు కూడా మంత్రి పలు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో నవాబ్ చెరువు మరియు ఇతర చెరువులు తెగడంతో గ్రామానికి వెళ్లే రహదారులు,బ్రిడ్జ్ లు కోతకు గురికావడంతో అధికారులతో కలిసి పోలీస్ బస్ లో ప్రయాణం చేస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ పరిశీలనకు వెళుతూ మార్గ మధ్యలో బాల్కొండ మండల కేంద్రంలో నాయకులు,ప్రజల్ని కలిసి మండలంలో కురిసిన భారీ వర్షాల గురించి ఆరా తీశారు..లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నాయకులు సహాయ సహకారాలు అందించాలని,బియ్యం కూరగాయలు అందించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వన్నెల్ బి,బోదెపల్లి,బాల్కొండ మండల ప్రజలను, నాయకుల ను కలుస్తూ గ్రామ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెండోరా మండలం కోడిచెర్ల మరియు సావేల్ గ్రామాల మధ్య రహదారి పై నుండి నిన్నటి వరకు ఉదృతంగా నీరు పారడంతో ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి నుండే ఆర్ అండ్ బి అధికారులకు కాల్ చేసి ఫోన్ లో శాశ్వత ప్రాతిపదికన ఎం చేయవచ్చునో పరిశీలించాలని అదేశించారు. పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ కు వరద ఎక్కువగా వస్తుండటంతో సుమారు 30 గేట్ల ద్వారా లక్ష 80వేల క్యూసెక్కుల నీరు గోదావరి లోకి వదులుతుండటంతో అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి పెద్ద ఎత్తున ఇన్ ఫ్లో వస్తున్నందున రిజర్వాయర్ దిగువన గల దూదిగాం, సావెల్, కోడిచెర్ల, చాకిరియాల్, బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల తదితర పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నది సమీపానికి వెళ్లే సాహసం చేయవద్దని, అనవసర ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ మేరకు ప్రజలెవరూ గోదావరి నది పరిసరాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మెండోరా, ఏర్గట్ల మండలాల రెవెన్యూ, పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వాయర్లో 80 నుండి 82 టీఎంసీ ల వరకు నీరు నిలువ ఉంచుతూ, మిగితా వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. వరద ప్రవాహం మరింతగా పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఐదు లక్షల క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు విడుదల చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. గత నలభై, యాభై సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రులు కూడా ఎస్సారెస్పీని పట్టించుకోలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారి ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతుల కోసం రూ. 22 కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఒకేసారి అన్ని గేట్ల మరమ్మతులు చేపట్టడం సాధ్యపడనందున విడతల వారీగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో ఆరు గేట్లకు మరమ్మతులు పూర్తి కావాల్సి ఉందని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

కాగా, వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడం వల్ల వరద తీవ్రత క్రమక్రమంగా తగ్గుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత మూడు రోజుల నుండి తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోందన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, జిల్లా యంత్రంగం యావత్తు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు. వరద తాకిడికి గురైన వారిని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వర్షపు జలాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి, సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. వర్షాల వల్ల నివాస గృహాలు దెబ్బతిన్న వారికి ఆపద్బాంధు పథకం కింద ఆదుకుంటామని, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించామన్నారు. శాశ్వత మరమాతులకు అవసరమైన అంచనాలను సైతం రూపొందించాల్సిందిగా సూచించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామని, బీ ఆర్ ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బాధితులకు భోజన సదుపాయం, ఇళ్ల మరమ్మతులకు ఆర్ధిక సహకారం అందించాలని సూచించారు.