సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్(Allu Arrest)ను అరెస్ట్ చేయడం పై యావత్ అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయేతర పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర సీమ విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. హైడ్రా పేరుతో నాగార్జున కు సంబదించిన కన్వెన్షన్ హాల్ ను కూల్చడం నుండే చిత్రసీమ రేవంత్ తీరు పై అగ్రం వ్యక్తం చేసింది. ఆ తర్వాత నుండి వరుసగా సినీ ప్రముఖులకు ప్రభుత్వం నుండి ఎదురవుతున్న ఇబ్బందులు అనేక మందిలో ఆగ్రహం నింపుతుండగా ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పై మరింత ఫైర్ అవుతుంది.
ఇదే క్రమంలో అభిమానులు , పలు రాజకీయ పార్టీల నేతలు సైతం రేవంత్ తీరు ను తప్పుబడుతూ బన్నీ అరెస్ట్ ను రాజకీయ పరిధిలో చూస్తున్నారు. మొన్న పుష్ప 2 సక్సెస్ మీట్ లో రేవంత్ పేరును మరచిపోవడం వల్లే బన్నీ ని అరెస్ట్ చేసారంటూ బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఎలాంటి కక్షతో వ్యవహరించలేదని మంత్రి సీతక్క ఇప్పటికే స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, దీనిపై ప్రభుత్వంపై విమర్శలు సరికాదని ఆమె పేర్కొన్నారు. అలాగే పొన్నం (Minister Ponnam Prabhakar) సైతం ఈ ఆరోపణలపై స్పందించారు.
సినిమా పరిశ్రమపై ప్రభుత్వానికి ఎలాంటి విరోధం లేదని మంత్రి పొన్నం తెలిపారు. దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతను టీఎఫ్‌డీసీ (తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా నియమించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సినీ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎప్పుడూ వెన్నుతట్టుగా ఉంటుందన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్‌తో కొందరు ప్రభుత్వం పై విమర్శలు చేయడం అనవసరమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా చట్టపరమైన అంశమని, వ్యక్తిగత కక్షలతో వ్యవహరించడం లేదని వారు స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వం పై అపోహలు కలిగి ఉండకూడదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చట్టానికి కట్టుబడి పని చేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమపై ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వం అభివృద్ధి చర్యలను కొనసాగిస్తుందని, అలాంటి విషయాలను వక్రీకరించకుండా ప్రజలు నమ్మకంగా ఉండాలని మంత్రులు పిలుపునిచ్చారు.
Read Also : Politics Lookback 2024 : మోదీ ప్రభుత్వం 2024లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే..!