తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 ప్రధాన గ్యారంటీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీలను అమలు చేయడం ప్రారంభించింది. మొదటగా, మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్, రూ.2 లక్షల రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రారంభించింది.
ఈ హామీలలో ముఖ్యమైనది ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఈ పథకం ద్వారా, రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు నిర్మించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అంతేకాదు, సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం అని ప్రభుత్వం చెప్పింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం ఎంతో మంది ఇళ్ళు లేని పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల మొదటి వారంలోనే ఈ పథకం ప్రారంభమవుతుందనే అంచనాలతో ఉన్నా, దానిని అమలు చేయకపోవడంతో ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకమైన ప్రకటన చేసారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇక, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని, గ్రామ సభలను ఏర్పాటు చేసి, అందులోనే లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం లో ఫస్టు విడత లో ఖాళీ స్థలాలు ఉన్న పేదలకు ఇళ్లను మంజూరు చేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు 400 చదరపు అడుగుల నూతన ఇళ్ళు నిర్మించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొత్త ఇందిరమ్మ ఇళ్లల్లో స్నానాల గది మరియు వంట గది తప్పనిసరిగా ఉండాలని నిబంధన ఉంచినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఈ పథకం ద్వారా ఆర్హులైన పేదలకు ఇళ్ళు నిర్మించుకోవడానికి ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయిలు ఆర్థిక సహాయం అందించబడుతుందని చెప్పారు. ఈ మొత్తాన్ని నాలుగు విడతలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
- పునాదులు నిర్మాణం పూర్తి కాగానే రూ. 1 లక్ష
- లెంటిల్ లెవల్ కు చేరగానే రూ. 1.25 లక్షలు
- ఇంటి స్లాబు వేసిన తర్వాత రూ. 1.75 లక్షలు
- గృహ ప్రవేశం సమయంలో రూ. 1 లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబడతాయన్నారు.