హైడ్రా (Hydraa) విషయంలో ప్రతిపక్షాలు (Opposition Parties) చేస్తున్న దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేసారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదన్నారు. మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని హరీష్ రావు ఫై పొన్నం మండిపడ్డారు.
సిద్దిపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..మూసీ నదికి ఇరువైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, వారి అంగీకారంతోనే ముందుకు సాగుతామని వెల్లడించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దంటూ పొన్నం సూచించారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తున్నామని, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నిర్వాసితులను లాఠీలతో అణచివేశారని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రజా సమస్యలపై నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ది.. పడగొట్టే సంస్కృతి బీఆర్ఎస్‌ది అని అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో కృష్ణ, గోదావరి జలాలను హైదారాబాద్‌కు తరలించి ప్రజలకు తాగు నీరు ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైదారాబాద్‌లోని మూసీని, లేక్ సిటీ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. యావత్ రాష్ట్రంలో హైడ్రాను స్వాగతిస్తున్నారని, రాబోయే కాలంలో అన్ని చెరువులను రక్షిస్తామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.
Read Also : Amit Shah : అగ్నివీరులకు పెన్షన్‌తో కూడిన ఉద్యోగం ఇస్తాం