Site icon HashtagU Telugu

Ponguleti Srinivas Reddy : భ‌ట్టి విక్ర‌మార్క‌తో పొంగులేటి భేటీ.. ఖ‌మ్మం కాంగ్రెస్‌లో అస‌లు రాజ‌కీయం మొద‌లైందా?

Bhatti Vikramarka And Ponguleti

Bhatti Vikramarka And Ponguleti

మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బ‌హిష్కృత నేత పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరిక దాదాపు ఖాయ‌మైంది. బుధ‌వారం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పొంగులేటితో భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లాలో పొంగులేటి వ‌ర్గానికి ఏఏ నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అయితే, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం భ‌ట్టి విక్ర‌మార్క క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్నాయి. ఉమ్మ‌డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వుల్లో అధిక‌శాతం భ‌ట్టి వ‌ర్గీయులే ఉన్నారు. ప్ర‌స్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైన నేప‌థ్యంలో.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పొంగులేటి వెంట భారీగానే ఆయ‌న వ‌ర్గీయులు కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉంది. అయితే, కాంగ్రెస్‌ పార్టీలోకి వ‌స్తే ఏఏ నియోజ‌క‌వ‌ర్గాలు త‌న‌ వ‌ర్గీయుల‌కు కేటాయిస్తార‌నే అంశంపై రేవంత్ రెడ్డితో పొంగులేటి చ‌ర్చించిన‌ట్లు తెలిసింది.

రేవంత్ రెడ్డి మాత్రం.. భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti vikramarka) తో ఓసారి భేటీ కావాల‌ని, మీరిద్ద‌రూ చ‌ర్చించుకొని నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపుపై ఓ అవ‌గాహ‌నకు రావాల‌ని పొంగులేటికి సూచించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే గురువారం న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్‌లో భ‌ట్టి విక్ర‌మార్క‌తో పొంగులేటి భేటీ అయ్యారు. ఈ భేటీలో వీరిద్ద‌రూ కొద్దిసేపు ఏకాంతంగా జిల్లా రాజ‌కీయాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అయితే, ప‌లు అంశాల‌ను పొంగులేటి భ‌ట్టి వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు తెలిసింది. భ‌ట్టి మాత్రం సీట్ల విష‌యంలో అధిష్టాన‌మే చూసుకుంటుంద‌ని, అధిష్టానం నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని పొంగులేటితో చెప్పిన‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో కాంగ్రెస్ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం భ‌ట్టి విక్ర‌మార్క క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయి. అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద‌దిక్కుగా భ‌ట్టి విక్ర‌మార్క ఒక్క‌రే ఉన్నారు. రేణుచౌద‌రి వ‌ర్గం ఉన్న‌ప్ప‌టికీ పెద్ద‌గా యాక్టివ్‌గా లేదు. దీంతో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్‌లో భ‌ట్టి విక్ర‌మార్క చెప్పిందే శాస‌నంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉమ్మ‌డి జిల్లాలో ఆర్థిక‌, ప్ర‌జాబ‌లం క‌లిగిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వ‌స్తుండ‌టం భ‌ట్టి వ‌ర్గానికి మింగుడుప‌డ‌ని అంశంగానే మారింది. పొంగులేటి పార్టీలో చేరితే ఆయ‌న వ‌ర్గీయుల హ‌వా ఎక్కువే ఉంటుంది. దీనికితోడు భ‌ట్టి వ‌ర్గంలోనూ పొంగులేటి అంటే ఇష్ట‌ప‌డేవారు అధికంగానే ఉన్నార‌న్న చ‌ర్చ జిల్లా రాజ‌కీయ‌ల్లో సాగుతుంది.

పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావ‌డం భ‌ట్టి విక్ర‌మార్క వ‌ర్గంకు ఇష్టంలేద‌న్న ప్ర‌చారం ఉమ్మ‌డి జిల్లాలో జోరుగా సాగుతుంది. కానీ, పొంగులేటి నేరుగా కేంద్ర‌, రాష్ట్ర పెద్ద‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌డం, ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో పొంగులేటి లాంటి నేత‌కూడా అవ‌స‌రం అని కాంగ్రెస్ పెద్ద‌లు భావిస్తున్న నేప‌థ్యంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక‌పై వ్య‌తిరేక‌త‌ను భ‌ట్టి వ‌ర్గం పైకి చెప్ప‌లేక పోతుంద‌న్న చ‌ర్చ కాంగ్రెస్ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. దీంతో, ఉమ్మ‌డి జిల్లా కాంగ్రెస్‌లో అస‌లు రాజ‌కీయం పొంగులేటి చేరిక‌తోనే మొద‌ల‌వుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు జిల్లా కాంగ్రెస్‌లో హ‌వాసాగించిన భ‌ట్టి వ‌ర్గం.. పొంగులేటి వ‌ర్గం కాంగ్రెస్‌లోకి వ‌స్తే వారి దూకుడును ఏ మేర‌కు త‌ట్టుకుంటుందోన‌న్న చ‌ర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. భ‌ట్టి అస‌లు రాజ‌కీయ స‌త్తా పొంగులేటి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త‌రువాత‌నే తెలుస్తుంద‌న్న వాద‌న‌ను ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు వెలుబుచ్చుతున్నారు.

Telangana Congress: క‌ర్ణాట‌క ఫార్ములా షురూ.. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే మ‌హిళలందరికీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్రయాణం .