మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరడం దాదాపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో రాహుల్ (Rahul Gandhi) లేదా ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సమక్షంలో పొంగులేటి, ఆయన వర్గీయులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే.. కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పొంగులేటి పలుసార్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఆయన వర్గీయులకు సీట్ల కేటాయింపు విషయంపై ప్రధానంగా చర్చజరిగినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కనీసం ఆరు నుంచి ఏడు నియోజకవర్గాల్లో తన వర్గీయులను బరిలోకి దింపుతానని, అందుకు ఓకే అయితే పార్టీలో చేరుతానని కాంగ్రెస్ అధిష్టానం వద్ద పొంగులేటి క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంసైతం పొంగులేటి డిమాండ్‌ను ఓకే చేయడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు పొంగులేటి సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే పొంగులేటి వెంట ఎవరెవరు పార్టీలో చేరుతారనే విషయంపై చర్చించేందుకు పొంగులేటితో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే, నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, భద్రచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి కీలకనేతగా ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆమె పెద్దగా జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం భట్టి విక్రమార్క కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లాతో పాటు భదాద్రి జిల్లాలోనూ భట్టి వర్గీయులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో భట్టి వర్గీయులు కొందరు పలు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటంతో భట్టి వర్గీయులు ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి కొద్దికాలంలోనే బలమైన నేతగా ఎదిగారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయన అనుచరగణం ఉంది. రెడ్డి సామాజికవర్గంతో పాటు కమ్మ సామాజికవర్గం, బీసీ, ఎస్సీ వర్గాల నుంచి పొంగులేటి వర్గీయులు, అభిమానుల సంఖ్య భారీగా ఉంది. ఈ క్రమంలో పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే ఇన్నాళ్లు ఏకపక్షంగాసాగిన భట్టి విక్రమార్క హవా తగ్గడం ఖాయమన్న వాదన ఆయన వర్గీలను ఆందోళనకు గురిచేస్తోందట. దీనికితోడు భట్టి వర్గీయులుగా ఉన్నవారిలోసైతం కొందరు పొంగులేటి అంటే ఇష్టపడేవారు ఉన్నారట. దీంతో పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే భట్టి హవా తగ్గడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి అనుకున్న విధంగా లక్ష్యం చేరుకోగలిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు పొంగులేటి చేతుల్లోకి వెళ్లడం ఖాయమన్న వాదన జిల్లా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.
BRS plan : జగన్ ఫార్ములాతో ఎన్నికలకు కేసీఆర్ సిద్ధం! వచ్చే 6నెలలు నగదు బదిలీ!!