తెలంగాణలో బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) వర్గాల రాజకీయ పరిస్థితి మళ్లీ అనిశ్చితిలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వ హామీతో బీసీలలో పెద్ద ఆశలు చిగురించాయి. తమకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని, పాలనలో భాగస్వామ్యం పెరుగుతుందని భావించిన బీసీలు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తొందరపాటుగా బిల్లు రూపొందించి సభలో ఆమోదించినా, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం ఆలస్యం కావడం, దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టు స్టేలు రావడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బీసీలు “మాకు తలుపు చూపి తాళం వేసినట్టయింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Garib-Rath Train: తప్పిన పెను ప్రమాదం.. రైలులో అగ్నిప్రమాదం!
బీసీ సంఘాల నాయకులు చెబుతున్నట్లు, ఈ రిజర్వేషన్ వ్యవహారం చట్టపరమైన సన్నాహాలు లేకుండా రాజకీయ ఉద్దేశ్యాలతో ముందుకు నెట్టడం మూలాన ఇంత దూరం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే “రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు” అని స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, 42% బీసీ రిజర్వేషన్లు ఆ పరిమితిని దాటి పోతున్నాయనే న్యాయసమస్య తలెత్తింది. దీనికి తగిన డేటా, కౌంటర్ సాక్ష్యాలు సేకరించకుండా ప్రభుత్వం బిల్లు ఆమోదించడంతో ఇప్పుడు మొత్తం వ్యవహారం నిలిచిపోయింది. ఫలితంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం మరల తగ్గే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాజకీయంగా బీసీల అసంతృప్తి పెరుగుతోంది. “మా హక్కులు మాకు రావాలంటే రోడ్డెక్కడం తప్ప మాకు మార్గం లేదు” అని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు బీసీ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విస్తృత ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు పండుగ సీజన్‌లో ప్రజలు ఉత్సాహంగా ఉంటే, మరోవైపు బీసీలు తమ “రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం” ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపు తిప్పే సూచనగా కనిపిస్తోంది.