September 17 : చ‌రిత్ర‌లో `సెప్టెంబ‌ర్ 17` సెగ‌

చరిత్ర‌ను ఎవ‌రికి అనుకూలంగా వాళ్లు మ‌లుచుకోవ‌డం స‌హ‌జంగా చూస్తుంటాం

  • Written By:
  • Updated On - September 16, 2022 / 05:47 PM IST

చరిత్ర‌ను ఎవ‌రికి అనుకూలంగా వాళ్లు మ‌లుచుకోవ‌డం స‌హ‌జంగా చూస్తుంటాం. ఆ విష‌యంలో రాజ‌కీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. మ‌హాత్మాగాంధీ కంటే గాడ్సే మంచోడు అనే భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉన్న దేశం మ‌న‌ది. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ త్యాగాల‌ను మ‌రుగున‌ప‌డేశార‌ని కాంగ్రెస్ మీద బీజేపీ ఎప్పుడూ విమ‌ర్శలు చేస్తుంటుంది. ముస్లిం రాజ్యాల చ‌రిత్ర అవ‌స‌రంలేద‌ని పాఠ్యాంశాల‌ను ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వం మార్చేస్తోంది. అంటే, ఆయా కాలాల్లో ఎవ‌రిది పైచేయిగా ఉంటే వాళ్ల‌కు అనుకూలంగా చ‌రిత్ర ఉంటుంద‌ని అనుకోవ‌డాన్ని త‌ప్పుప‌ట్ట‌లేం. అలాగే, సెప్టెంబర్ 17వ తేదీని ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ చెప్పుకుంటోంది. బీజేపీ విమోచ‌నం అంటే ఎంఐఎం విద్రోహం అంటోంది. కాంగ్రెస్ పార్టీ విలీనదినోత్స‌వం అంటే క‌మ్యూనిస్ట్ లు విముక్తి దినోత్స‌వం అంటున్నారు. ఇలా ప‌లు ర‌కాలుగా చ‌రిత్ర‌ను అన్వ‌యించుకుంటోన్న రాజ‌కీయ పార్టీలు ఎవ‌రి పంథాలో వాళ్లు ప‌బ్లిక్ మైండ్ ను డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

విమోచ‌నం దినోత్స‌వంగా 17వ తేదీని బీజేపీ ఫోక‌స్ చేస్తోంది. అందుకోసం కేంద్ర ప్ర‌భుత్వ‌మే అధికారికంగా రంగంలోకి దిగింది. తొలిసారిగా అంగ‌రంగ వైభ‌వంగా సెప్టెంబ‌ర్ 17వ తేదీని విమోచ‌న దినంగా జ‌రుపుకోవ‌డానికి ప్లాన్ చేసింది. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో వేడుక చేసుకోవ‌డానికి ఏర్పాట్లు చేసుకుంది. ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైద‌రాబాద్ లో అడుగుపెట్టారు. వాళ్ల‌తో పాటు మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, క‌ర్నాట‌క సీఎం బొమ్మై, ఇత‌ర బీజేపీ అగ్ర‌జులు హైద‌రాబాదుకు చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.

స‌రిగ్గా ఇదే బీజేపీ అగ్ర నేత‌లు హైద‌రాబాద్ లో అడుగుపెట్టే స‌మ‌య‌డానికి మూడు రోజుల వ‌జ్రోత్స‌వాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. స‌మైక్య‌త నినాదంతో సెప్టెంబ‌ర్ 17వ తేదీకి ఒక రోజు ముందు ఒక రోజు త‌రువాత వ‌జ్రోత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌ని పిలుపునివ్వ‌డం రాజ‌కీయ ఎత్తుగ‌డ‌. వాటికి స‌హ‌జ మిత్రునిగా ఉన్న ఎంఐఎం మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం హైలెట్ పాయింట్‌. ఆ రెండు పార్టీలు సంయుక్తంగా స‌మైక్య‌త కోసం వ‌జ్రోత్స‌వాల‌ను తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు జ‌ర‌పుకోవ‌డానికి క్యాడ‌ర్ ను సిద్ధం చేశాయి. అందులో భాగంగా శుక్ర‌వారం ప‌లు ప్రాంతాల్లో స‌మైక్య‌తా ర్యాలీను పెద్ద ఎత్తున నిర్వ‌హించారు.

1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 16 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ సమైక్యతా దినోత్సవ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సెప్టెంబరు 17న ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రసంగిస్తారు. బిజెపి విమోచ‌నదినోత్స‌వ వేడుకుల‌కు కౌంట‌ర్ గా అనేక కార్యక్రమాలు ఆ రోజున కేసీఆర్ రూప‌క‌ల్ప‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

ఉదయం పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పీపుల్స్‌ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం మీదుగా ఇందిరాపార్క్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌, ఆదివాసీ భవన్‌ల ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు నలుమూలల నుంచి పలువురు గిరిజనులు తరలివస్తున్నారు. ప్రజలను సమీకరించడానికి అధికార పార్టీ అన్ని జిల్లాలు, నగరంలో టిఎస్ఆర్‌టిసి బస్సులు, ప్రైవేట్ బస్సులను ముందుగానే బుక్ చేసింది.

సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ కేంద్రంగా ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల ముగింపు స‌భ విజ‌య‌వంతం అయింది. అనూహ్యంగా జ‌నం రావ‌డంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ను శ‌భాష్ అంటూ భుజంత‌ట్టి ప్రోత్స‌హించారు. అలాంటి స‌భ‌ను మ‌ళ్లీ సెప్టెంబ‌ర్ 17వ తేదీన బీజేపీ అగ్ర‌జులు ఊహిస్తున్నారు. కానీ, ముందుగా టీఆర్ఎస్ చీఫ్ చేసిన ఎత్తుగ‌డ‌ల కార‌ణంగా బీజేపీ నిర్వ‌హించే విమోచ‌న దినోత్స‌వం ఫెయిల్ కావ‌డానికి అవ‌కాశం ఉంది. జ‌నాన్ని త‌ర‌లించ‌డానికి బ‌స్సులు కూడా లేకుండా టీఆర్ఎస్ క‌ట్ట‌డీ చేసింది. ప్ర‌చారం చేసుకోవ‌డానికి జాగా ఎక్క‌డా లేకుండా ముందుగానే రిజ‌ర్వు చేసుకుంది. దీంతో బీజేపీ విమోచ‌న స‌భ వెల‌వెల‌బోయే అవ‌కాశం లేక‌పోలేదు.