ఎన్నికలు (Elections ) వస్తున్నాయంటే రాజకీయ పార్టీలకు (Political Parties) అందరు గుర్తుకొస్తారు..అన్ని గుర్తుకొస్తాయి..ఏది వదిలిపెట్టకుండా అన్నింటిని గుర్తుపెట్టుకోవడం..గుర్తుచేసుకోవడం చేస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వేడి మొదలైంది. మరో నాల్గు , ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ప్రజలను ఎలా మభ్య పెట్టాలి..ఎలా ఆటలు దండుకోవాలని శతవిధాలా ట్రై చేస్తున్నాయి. అందుకే ఏ దానిని కూడా వదిలిపెట్టడం లేదు.
రేపు(సెప్టెంబరు 17) తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day). గతంలో ఈ రోజును రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం ఎన్నికల సమయం కావడం తో ప్రతి పార్టీ దీనిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఎవరికీ వారు తెలంగాణ విమోచన దినోత్సవం (Telangana Liberation Day 2023)విషయంలో తగ్గేదెలా అంటున్నారు. గత రెండేళ్లుగా బీజేపీ మాత్రమే ఈ వేడుకలను నిర్వహించింది. కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలోని BRS, Congress, AIMIM కూడా ఈ వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. దీంతోపాటు ర్యాలీలు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 17న హైదరాబాద్ మొత్తం రాజకీయ సభలు, అట్టుడికిపోనుంది.
మరోపక్క ఆదివారం అమిత్ షా, రాహుల్ గాంధీ, కె చంద్రశేఖర్ రావు, అసదుద్దీన్ ఒవైసీలు తమ పార్టీల కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు. అయితే ప్రజల మెప్పు పొంది, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని సామాన్య ప్రజలు అంటున్నారు. ఇప్పటివరకు గుర్తురాని తెలంగాణ విమోచన దినోత్సవం..ఇప్పుడు గుర్తువస్తుందంటే దానికి అర్ధం ఎన్నికలే అని ఏమాత్రం తెలియదా..అని ప్రశ్నిస్తున్నారు.
Read Also : APPSC Exam Dates : ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ డేట్లు వచ్చేశాయి.. అభ్యర్థులూ బీ రెడీ
రేపు 1948లో హైదరాబాద్(hyderabad) రాచరిక రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన జ్ఞాపకార్థం మేరకు BRS పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు , నేతలకు ఆదేశాలు జారీ చేసారు సీఎం కేసీఆర్. అలాగే రేపు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇక జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని AIMIM తిరంగా బైక్ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహిస్తోంది. తిరంగా ర్యాలీ దర్గా యూసుఫైన్, నాంపల్లి (నమాజ్-ఎ-జోహార్ తర్వాత) నుంచి హాకీ గ్రౌండ్స్, (ఈడిగా బిలాలీ) మసాబ్ ట్యాంక్ వరకు మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు మాసబ్ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు పాల్గొననున్నారు.
ఇక బిజెపి (BJP) సైతం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జారబోతున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమిత్ షా హాజరుకానున్నారు. సెప్టెంబరు 17, 1948న సర్దార్ పటేల్ పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత తమదేనని బీజేపీ చెబుతోంది. బీజేపీ నిజాం పాలనకు ముగింపు పలకాలని భావిస్తోంది. అలా చేయడం ద్వారా, అధికార BRS మరియు దాని ‘స్నేహపూర్వక’ భాగస్వామి AIMIM రెండింటినీ లక్ష్యంగా చేసుకోవాలని BJP లక్ష్యంగా పెట్టుకుంది.
మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం ఈరోజు , రేపు CWC సమావేశాలను హైదరాబాద్ లో జరపబోతున్నారు. అలాగే రేపు సాయంత్రం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు సోనియా , రాహుల్ , ప్రియాంక తదితరులు హాజరుకానున్నారని తెలిపింది టి కాంగ్రెస్. ఇలా మొత్తం మీద ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు దేనిని వదిలిపెట్టడం లేదు.