Strategists: `బాస్`ల‌కే `సూప‌ర్ బాస్`లు వాళ్లు!

ఎన్నిక‌లు బిజినెస్ రూపంలోకి వెళ్లిపోయాయి. వ్యాపార వ‌స్తువుగా రాజ‌కీయ పార్టీల‌ను మార్చేశారు.

  • Written By:
  • Updated On - June 8, 2022 / 03:09 PM IST

ఎన్నిక‌లు బిజినెస్ రూపంలోకి వెళ్లిపోయాయి. వ్యాపార వ‌స్తువుగా రాజ‌కీయ పార్టీల‌ను మార్చేశారు. వ్యాపారులు, పారిశ్రామిక‌వేత్త‌లు రాజ‌కీయాల్లో కీల‌కంగా మారారు. ఒక‌ప్పుడు విద్యార్థి ద‌శ నుంచి ప్ర‌జాసేవ కోసం రాజ‌కీయ పార్టీల్లోకి వ‌చ్చే ప‌ద్ద‌తిని చూశాం. ఆ త‌రువాత రౌడీలు, గుండాలు కొన్నేళ్లు రాజ‌కీయ పార్టీల్లో రాజ్యం ఏలారు. ప్ర‌స్తుతం డ‌బ్బున్న వాళ్ల చేతిలోకి రాజ‌కీయ వెళ్లిపోయింది. దీంతో పార్టీల‌కు బ్రాండ్ బిల్డ్ చేయడానికి వ్యూహ‌క‌ర్త‌ల డిమాండ్ నెల‌కొంది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా తొలిసారి ఏపీలో ప్ర‌శాంత్ కిషోర్ అద్భుత ఫ‌లితాల‌ను సాధించిపెట్టారు. దీంతో మిగిలిన పార్టీలు కూడా ప్ర‌శాంత్ కిషోర్ త‌యారు చేసిన ఐ ప్యాక్ మూలాలున్న వ్యూహ‌క‌ర్త‌లను చూసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహ‌క‌ర్త రోల్ నుంచి త‌ప్పుకుంటున్నారు. ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని ప్ర‌య‌త్నం చేసిన వైఫ‌ల్యం చెందారు. ప్ర‌త్యామ్నాయంగా బీహార్‌లో `జ‌న్ సురాజ్ ` పేరుతో పాద‌యాత్ర‌కు ఆయ‌న ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఆయ‌న శిష్యుల కోసం ఏపీ, తెలంగాణ‌లోకి రాజ‌కీయ పార్టీలు అన్వేషిస్తున్నాయి. ఐ ప్యాక్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడుగా ఉన్న రుషి రాజ్ సింగ్ ను ఈసారి వైసీపీ వ్యూహ‌క‌ర్త‌గా పెట్టుకుంద‌ని తెలుస్తోంది. ఆయ‌న్ను మంగ‌ళ‌వారం జ‌రిగే పార్టీ సమ‌న్వ‌య క‌ర్త‌లు, జిల్లా ఇంచార్జిల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిచ‌య‌ చేయ‌బోతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికే రాబిన్ శ‌ర్మ‌ను వ్యూహ‌క‌ర్త‌గా పెట్టుకుంది. ఇటీవ‌ల ఆయ‌న్ను మార్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న స్థానంలో సునీల్ క‌నుగోలును నియ‌మించుకున్నార‌ని వినికిడి. బాదుడేబాదుడు కార్యక్ర‌మంతో పాటు మ‌హానాడు విజ‌య‌వంతానికి కూడా వ్యూహ‌క‌ర్త కార‌ణ‌మంటూ ఆ పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ర‌చూ లోకేష్ వ్యూహ‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అవుతూ పార్టీ బ‌లోపేతం కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. అందుకే, మ‌హానాడు అనూహ్య విజ‌య‌వంతానికి లోకేష్ కార‌ణం అంటూ పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా గెలిచే అభ్య‌ర్థుల విష‌యంలోనూ స‌ర్వేలు చేయించార‌ని తెలుస్తోంది. అందుకే, యూత్ కు 40శాతం ఇస్తామ‌ని ప్ర‌తి వేదిక‌పైన టీడీపీ ప్ర‌క‌టిస్తోంది.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మీక్షించారు. ఆ సంద‌ర్భంగా వ్యూహ‌క‌ర్త రుషిరాజ్ సింగ్ త‌యారు చేసిన స‌ర్వేల ఆధారంగా డైరెక్ష‌న్ ఇస్తార‌ని తెలుస్తోంది. గ‌తంలో ఏ విధంగా ప్ర‌శాంత్ కిషోర్ ను లీడ‌ర్ల‌కు బాహాటంగా ప‌రిచ‌యం చేశారో, అదే విధంగా మంగ‌ళ‌వారం నాడు జ‌రిగే స‌మీక్ష‌లో రుషిరాజ్ ను ప‌రిచ‌యం చేస్తార‌ని తెలుస్తోంది. ఇక తెలంగాణ‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌శాంత్ కిషోర్ డైరెక్ష‌న్ ఇస్తున్నాడు. ఆయ‌న శిష్యుల్లో ఎవ‌రో ఒక‌ర్ని నియ‌మించుకునే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం సునీల్ క‌నుగోలు వ్యూహాల ప్ర‌కారం న‌డుచుకుంటోంది. మొత్తం మీద ఏపీ, తెలంగాణ రాజ‌కీయాలు ఐ ప్యాక్ త‌యారు చేసే వ్యూహాల చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే, ఇంకా ఏడాది, రెండేళ్లు టైం ఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం రెండు రాష్ట్రాల్లోనూ క‌నిపిస్తోంది.