తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కనుంది. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వెడెక్కనున్నాయి. మునుగోడు ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీలు తమ ప్రణాళికలను రచించుకుంటున్నాయి. మునుగోడులో త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. ఉపఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మునుగోడులో వాలిపోయారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ మొదటి లేదా రెండో వారంలో ఉండే అవకాశం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలిపారు.
హైదరాబాద్‌లో మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ, పార్టీ మండల అధ్యక్షులు, ఇంచార్జ్‌లతో బన్సల్ శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికకు ఇంకా 40 రోజులే ఉన్నందున ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంచార్జీలు, ముఖ్య నాయకులు మునుగోడులోనే ఉండాలని సూచించారు. ఉపఎన్నికల విజయం సాధించాలంటే చేయాల్సిన అంశాలను ఆయన వివరించారు. ఉపఎన్నిక నోటిఫికేషన్‌కు ముందు.. ఆ తర్వాత ఎటువంటి అంశాలపై దృష్టిసారించాలనే విషయాలపై బీజేపీ నేతలకు వివరించారు.