Congress Leader Arrest: తెలంగాణలో ‘రాహుల్’ హీట్

తెలంగాణలో రాహుల్ టూర్ పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఓయూ కేంద్రంగా రాహుల్ పర్యటన కోసం అనుమతి నిరాకరణ వివాదాస్పదం అయింది.

  • Written By:
  • Updated On - May 1, 2022 / 09:58 PM IST

తెలంగాణలో రాహుల్ టూర్ పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఓయూ కేంద్రంగా రాహుల్ పర్యటన కోసం అనుమతి నిరాకరణ వివాదాస్పదం అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ మంత్రుల నివాసలను ముట్టడించడానికి విద్యార్థులు ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా వాళ్లని పోలీస్ లు అరెస్ట్ చేశారు. స్టేషన్లలో విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మే 6,7వ తేదీల్లో తెలంగాణకు రానున్నారు. రాహుల్‌గాంధీ ఓయూలో పర్యటిస్తారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. అయితే, ఓయూ వీసీ, ప్రభుత్వం అనుమతి లభించలేదు. అనుమతివ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆదివారం ఓయూ విద్యార్థులు మినిస్టర్స్‌ క్వార్టర్స్ ముట్టడించారు.

మినిస్టర్స్ క్వార్టర్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన ఓయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంత రాజ్యంలో ఉన్నామా? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల భిక్ష అని, కేసీఆర్ ఒక పిరికి పాలకుడు అని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకున్నందుకు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం దారుణమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మొత్తం మీద రాహుల్ పర్యటన తెలంగాణ రాజకీయాలను వేడెకించింది. ప్రభుత్వానికి వణుకు పుట్టేలా వరంగల్ సభను కాంగ్రెస్ ప్లాన్ చేసింది.