Hyderabad : నెల రోజుల్లో రూ.10 కోట్ల‌కుపైగా హ‌వాలా డ‌బ్బు ప‌ట్టుకున్న పోలీసులు

గత నెల రోజులుగా హైద‌రాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో హవాలా సొమ్ముగా అనుమానిస్తున్న రూ.10.96 కోట్లకు పైగా పోలీసులు..

  • Written By:
  • Updated On - October 27, 2022 / 10:11 AM IST

గత నెల రోజులుగా హైద‌రాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో హవాలా సొమ్ముగా అనుమానిస్తున్న రూ.10.96 కోట్లకు పైగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా ఆపరేటర్లుగా అనుమానిస్తున్న కొందరు పట్టుబడగా.. డబ్బుకు లెక్కలు చూపకపోవడంతో కొందరు సబ్ ఆపరేటర్లు, మరికొంత మంది డబ్బును తీసుకువెళుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్ పోలీసులు హుమాయూన్‌నగర్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.1.24 కోట్ల లెక్కల్లో చూపని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి అయిన అతడు కోటిలోని గుజరాతీ గల్లీ నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి నలుగురికి అందజేయాలని పేర్కొన్నాడు. అక్టోబర్ 9న రూ. 2.49 కోట్ల లెక్కల్లో చూపని సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకోగా వారి వద్ద బ్యాగులో ఉంచిన నగదును గుర్తించారు. అక్టోబర్ 11న రెండు కార్లను ఆపి రూ. 3.5 కోట్ల న‌గ‌దును హిమాయత్‌నగర్‌లో ప‌ట్టుకున్నారు. కార్లలో ఉన్న ఆరుగురు వ్యక్తులు హిమాయత్‌నగర్‌లో న‌గ‌దును మొత్తాన్ని సేకరించి, నగర శివార్లలోని మరొక వ్యక్తికి అప్పగించడానికి హయత్‌నగర్‌కు వెళుతున్నట్లు సమాచారం.

మరో కేసులో అక్టోబర్ 12న పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 2కోట్ల‌ను నలుగురి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వద్ద నగదుతో నలుగురు వ్యక్తులు వేచి ఉండగా ప‌క్కా స‌మాచారంతో వారిని ప‌ట్టుకున్నారు. బంజారాహిల్స్‌లోని మరొక వ్యక్తికి నగదును అందజేయాలని గుజరాత్‌లోని ఒక వ్య‌క్తి నుంచి వారికి సూచనలు వచ్చినట్లు సమాచారం. జుమెరత్ బజార్‌లోని MJ వంతెన వద్ద పోలీసులు అక్టోబర్ 21 న హవాలా మనీ రాకెట్‌ను ఛేదించారు. రూ.1.1 కోట్ల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు వాహన తనిఖీల్లో ముఠాను పట్టుకున్నారు. అక్టోబర్ 23న హవాలా రాకెట్‌ను ఛేదించిన పోలీసులు రూ. 63.50 లక్ష‌లు ఐదుగురి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్‌బజార్‌లోని ఓ ఎలక్ట్రికల్‌ గోడౌన్‌పై పోలీసులు దాడి చేయగా.. హవాలా వ్యాపారంలో సబ్‌ ఆపరేటర్‌లుగా పట్టుబడ్డారని తేలింది.