జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ (Janwada Farmhouse Rave Party) వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad Pakala), అలియాస్ రాజ్ పాకాల చుట్టూ ఉచ్చుబిగిస్తుంది. శనివారం రాత్రి జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి, కార్తీక్ అనే వ్యక్తిని ఏ1గా పేర్కొని, రాజ్ పాకాలను ఏ2గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం రాయదుర్గం లోని ఓరియన్ విల్లాస్ నెంబర్ 40 వద్ద రాజ్ పాకాల ఇంటికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో, జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఎక్సైజ్ పోలీసులు మరోసారి తనిఖీలు నిర్వహించి, కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ లో రాజ్ పాకాల స్వయంగా ఈ పార్టీని నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరోపక్క దీనిపై రాజకీయ పార్టీల నేతలు సైతం స్పందిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతలు..కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.
గజ్వేల్ పట్టణంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని ప్రకటిస్తుంది. కానీ శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలని విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతుందని ఆరోపించారు. విదేశీ మాదక ద్రవ్యాలతోపాటు, కొకైన్ లు విచ్చలవిడిగా తెచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలో బాగా ఫేమస్ అయిన ఫాంహౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, వీఐపీల పిల్లలు ఉన్నారని అనేక వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఫాంహౌస్ ఒనర్ తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫాంహౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను 12 గంటలలో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫాంహౌస్ లో ఎస్వోటీ పోలీసులు రైడ్ చేసినప్పుడు ఫాంహౌస్ లో, బయట ఉన్న పుటేజ్ లు రిలీజ్ చేయాలని రఘునందన్ రావు అన్నారు.
సీఎం జన్వాడ ఫాంహౌస్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు రాజీ పడ్డారని వార్తలు వస్తున్నాయి. 12గంటలు కల్లా ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే సీసీ ఫుటేజ్ ఎడిటింగ్ చేస్తారు. రేవంత్ రెడ్డి పొల్యూట్ కాకపోతే జన్వాడ ఫాం హౌస్ లో శనివారం రాత్రి ఏం జరిగింది ప్రజలకు తెలియజేయాలని రఘునందన్ రావు అన్నారు. మళ్లీ మేం పేరు చెబితే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు. అందుకే ఆ పార్టీ రాజుదా? యువరాజుదా? రేవ్ పార్టీనా, రావుల పార్టీనా అనేది బయటపడాలి’ అని అన్నారు.
Read Also : Diwali 2024: దివాలీ రోజు కేవలం 13 దీపాలను మాత్రమే ఎందుకు వెలిగిస్తారో తెలుసా?