Rave Party Action: డ్రగ్స్ పై పోలీస్ ‘శివ’తాండవం

రేవ్ పార్టీలపై నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పై సస్పెండ్ వేటు పడింది.

రేవ్ పార్టీలపై నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పై సస్పెండ్ వేటు పడింది. చాలా కాలంగా బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ పబ్‌ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పబ్‌పై దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడున్న యువతీ యువకులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిలో చాలామంది డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానించిన పోలీసులు 142 మందిలో 45 మంది దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపారు.
ఈ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో అక్కడికి చేరుకున్నారు. పబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నట్లు నిర్ధారించుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే పోలీసులు భారీ సంఖ్యలో పబ్‌ను చుట్టుముట్టడంతో ఆందోళనకు గురై తమ చేతుల్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను ఎక్కడపడితే అక్కడ పడేసి పరుగులు తీశారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు 6 గ్రాముల కొకైన్‌తో పాటు భారీగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ పబ్‌లో తరుచూ రేవ్ పార్టీలు జరుగుతున్నప్పటికీ బంజారాహిల్స్ పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో పక్కా స్కెచ్‌తో ఈ దాడులు చేయించినట్లు తెలుస్తోంది.
తాజా సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు. ఈ పబ్‌పై గతంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చినా సీఐ శివచంద్ర పట్టించుకోలేదని తేలిందని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఆయనపై చర్యలు తీసుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.