Site icon HashtagU Telugu

Hyderabad : గోవుల‌ను అక్ర‌మ ర‌వాణా చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

Cows Imresizer

Cows Imresizer

గోవుల‌ను అక్ర‌మ ర‌వాణా చేస్తున్న వ్య‌క్తిని హైద‌రాబాద్ ప‌హాడీష‌రీఫ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. బొలెరో వాహ‌నం ట్రక్కులో తరలిస్తున్న ఎనిమిది ఆవులను తుక్కుగూడ వద్ద పహాడీషరీఫ్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ వాహనంలో కొందరు వ్యక్తులు ఆవులను తరలిస్తున్నట్లు డయల్ 100 కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు స‌మాచారం అందిందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం కాశీ విశ్వనాథ్ తెలిపారు. వెంటనే డయల్ 100కి కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్న ప్రదేశానికి సి వెంకటయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్ చేరుకున్నారు. బొలెరో వాహనంలో సరైన ఆహారం, నీరు, శ్వాస తీసుకోవడానికి స్థలం లేకుండా, క్రూరమైన రీతిలో ఎనిమిది ఆవుల‌ను క‌ట్టివేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గులివెందడ గ్రామానికి చెందిన డ్రైవర్ గవర ప్రసాద్ తాను విజయవాడ నుండి తుక్కుగూడ గ్రామం మీదుగా హైదరాబాద్‌లోని కబేళాలకు వచ్చినట్లు పోలీసుల‌కు తెలిపాడు.

ఏడాది క్రితం బొలెరో వాహనాన్ని కొనుగోలు చేసి జీవనోపాధి కోసం దాన్ని నడుపుతూ అప్పుడప్పుడు విజయవాడ పశువుల మార్కెట్‌లో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని కబేళాలకు తరలించేవాడని పహాడీషరీఫ్‌ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఆదివారం ప్రసాద్ ఎనిమిది ఆవులను కొనుగోలు చేసి తన బొలెరో వాహనంలో ఎక్కించి ఆహారం, నీరు, గాలి తదితర సౌకర్యాలు కల్పించకుండా అమానుషంగా తాళ్లతో కట్టేశాడు. హైదరాబాద్‌కు వెళ్తుండగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోకి రాగానే వాహ‌నంతో పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పశువులను గోశాలకు తరలించారు.