సూర్యాపేట జిల్లాలో ఒక పోలీసు కానిస్టేబుల్ (Constable) వరుస వివాహాలతో వార్తల్లో నిలిచాడు. నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కృష్ణంరాజు (Constable Krishnamraju) అనే కానిస్టేబుల్ ఇప్పటివరకు నాలుగు వివాహాలు చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాహాల పరంపరలో ఒక మైనర్ బాలికను కూడా వివాహం చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
కానిస్టేబుల్ కృష్ణంరాజు మూడవ వివాహం, ఏడాది క్రితం సూర్యాపేట మండలానికి చెందిన ఒక మైనర్ బాలికతో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బాలిక ప్రస్తుతం సూర్యాపేట పట్టణంలో నివసిస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రచారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ దృష్టికి వెళ్లడంతో, ఆయన తక్షణమే విచారణకు ఆదేశించారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించారు, ఆయన బాలిక నివాసానికి వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
Minister Post : మాట మార్చిన రాజగోపాల్..మంత్రి పదవి అవసరమే లేదు
ఈ కానిస్టేబుల్‌పై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలతో సస్పెండయ్యారు. ఆ తర్వాత నడిగూడెం స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. మైనర్ బాలికతో వివాహం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో, కానిస్టేబుల్ కృష్ణంరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఉన్నతాధికారులు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.