PM@TS: తెలంగాణను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ.. అసలు వ్యూహం ఇది!

తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 07:52 PM IST

తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. అందుకే ఇప్పుడు తన జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. నేతలంతా రెండు రోజులపాటు పూర్తిగా తెలంగాణ జపమే చేశారని చెప్పాలి. దానికి తగ్గట్టుగానే పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.. తెలంగాణ సంస్కృతిని, వైభవాన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రారంభమైంది.

ప్రాచీన సంస్కృతితోపాటు పరాక్రమవంతుల గడ్డ, పుణ్యస్థలం తెలంగాణ అని ప్రధాని మోదీ అన్నారు. మీరంతా 2019 ఎన్నికల్లో ఎంతో ప్రేమను, అభిమానాన్ని పంచారని సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు ఈ సభను చూస్తుంటే.. తెలంగాణ మొత్తం పరేడ్ గ్రౌండ్స్ లో కూర్చున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్వధ్వానాలు వచ్చాయి.

మోదీ ప్రసంగం మధ్యలో సభకు వచ్చినవారంతా తమ హర్షాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించారు. దీంతో మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి.. మీ ప్రేమను, అభిమానాన్ని చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోందని అన్నారు. అందుకే మరింత ఉత్సాహంగా ఆయన మళ్లీ ప్రసంగాన్ని ప్రారంభించారు. మీ ప్రేమ, ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకున్నానని ఆయన అన్నారు. ప్రజలందరికీ అభివాదాలు తెలిపారు.

ఈ సభ ద్వారా తాము అనుకున్న లక్ష్యం నెరవేరిందని బీజేపీ ఆశిస్తోంది. అందుకే ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వరకు పోరాడితే.. కచ్చితంగా సానుకూల ఫలితం సాధిస్తామన్న నమ్మకంతో ఉంది.